సజ్జనార్ కీలక నిర్ణయం.. వారందరికి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

హైదరాబాద్- వీసీ సజ్జనార్.. మొన్నటి వరకు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ గా డైనమిక్ గా పనిచేసిన ఈ అధికారి గురించి అందరికి తెలుసు. సజ్జనార్ ను తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నియమంచగా.. అక్కడ కూడా తన మార్కు మార్పును తీసుకువస్తున్నారు. ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్టీసీ సంస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు సజ్జనార్. గతంలో లేని విధంగా ఆర్టీసీలో సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ మార్పుకు శ్రీకారం చుడుతున్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికులు సమస్యలపై వెను వెంటనే స్పందిస్తున్న సజ్జనార్, అతి వేగంగా వాటిని పరిష్కరిస్తున్నారు. చాలా కాలంగా నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని మళ్లీ లాభాల బాట పట్టించేందుకు సజ్జనార్ తీసుకుంటున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు బాగా ఉపయోగపడుతున్నాయి. తెలంగాణ ఆర్టీసీలో స్వచ్ఛంద కార్యక్రమాలను కూడా సజ్జనార్ నిర్వహిస్తున్నారు. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోల్లో మెగా రక్త దాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ చెప్పారు.

TSRTC BUS SERVICES 1

పౌరుల తోపాటు, ఆర్టీసీ ఉద్యోగులు కూడా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తలసేమియా బాధితుల కోసం ఈ శిబిరాలు ఏర్పాటు చేశామని, ఆర్టీసీ యాజమాన్యం, ప్రహరి ట్రస్ట్, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. దీనికి అందరి సహకారం కావాలని ఆయన కోరారు.

కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరన్నర కాలం పాటు రక్తం దొరకక చాలా మంది తలసేమియా బాధితులు ఇబ్బంది పడుతున్నారని సజ్జనార్ చెప్పారు. అందుకే రక్త దానం చేసేందుకు అందరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేగా రక్త దాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరూ మంగళవారం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని సజ్జనార్ ప్రకటించారు.