హైదరాబాద్- సంక్రాంతి పండగను వాన పలకరిస్తోంది. గత రెండు రోజులుగా తెలంగాణలో అక్కడక్కడ చిరు జల్లులు కురుస్తున్నాయి. అసలే చలికాలం కావడం, అందుకు వాన తోడవ్వడంతో వాతావరణం మరింత చల్లబడింది. ఇదిగో ఇటువంట సమయంలో తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఐఎండి పేర్కొంది. గత రెండు రోజులు రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో పగటి పూట ఉష్ణోగ్రతలు తగ్గి చలి విపరీతంగా పెరిగింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం మంగలవారిపేటలో 87.8 మిల్లీ మీటర్లు, మహబూబాబాద్ జిల్లా కురవి మండలం ఉప్పరగూడెంలో 68.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆదిలాబాద్ జిల్లాలో గురువారం ఉష్ణోగ్రత కనిష్ఠంగా 14.2 డిగ్రీలుగా నమోదైంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 15.2, నిర్మల్‌లో 15.7, నిజామాబాద్‌లో 16.2, నారాయణపేటలో 16.8, వికారాబాద్‌లో 17.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, జనగామ, ములుగు, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోనూ జల్లులు కురిశాయి.