హైదరాబాద్- తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతోంది. పోలీసులు లాక్ డౌన్ ను మరింత కఠినతరంగా అమలుచేస్తున్నారు. అనుమతి లేనిదే రోడ్డుపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ.. వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు పోలీసులు. ఇక తెలంగాణ సరిహద్దులను సైతం పోలీసులు మూసేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ఖచ్చితంగా పోలీసుల నుంచి ఈ పాస్ తీసుకుని రావాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో కర్ణాటక, ఆంద్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి వచ్చే వాహనాలు భారీగా సరిహద్దుల దర్రగ నిలిచిపోయాయి. ఇక హైదరాబాద్ లాంటి నగరాల్లో సైతం పోలీసులు ప్రధాన కూడళ్లలో బారీకేడ్స్ ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో సినీ నటుడు నిఖిల్ ను హైదరాబాద్ పోలీసులు అడ్డుకున్నారు.
కరోనా బాధితులకు అత్యవసరంగా మందులు ఇచ్చేందుకు వెళ్తున్నానని చెప్పినా నిఖిల్ ను పోలీసులు అనుమతించలేదు. ఈ విషయాన్ని నిఖిల్ సోషల్ మీడియా ద్వార వెళ్లడించారు. కరోనా వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి మందులు అందించేందుకు ఉప్పల్ నుంచి సికింద్రాబాద్ మినిస్టర్స్ రోడ్డులో కిమ్స్ ఆస్పత్రికి వెళ్తుండగా పోలీసులు తన కారుని అడ్డుకున్నారని నిఖిల్ చెప్పారు. కరోనా బాధితుడి వివరాలతో పాటు వైద్యులు రాసిచ్చిన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ చూపించినా పోలీసులు తనను అనుమతించలేదని చెప్పకొచ్చారు. నగరంలో ఎక్కడికి వెళ్లాలన్నా ఈ పాస్ ఉండాల్సిందే పోలీసులు నిక్కచ్చిగా చెప్పారని తెలిపారు.
దీంతో తాను ఈ పాస్ కోసం చాలా సార్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందని, పోలీస్ వెబ్ సైట్ సర్వర్లు డౌన్ కావడం వల్ల తనకు ఈ పాస్ దొరకలేదని ఆవేధన వ్యక్తం చేశారు నిఖిల్. ఐతే కరోనా రోగికి మందులు ఇవ్వాలి కాబట్టి, ఇది మెడికల్ ఎమర్జెన్సీ కిందకు వస్తుందని, పోలీసులు తనకు అనుమతి ఇస్తారని భావించానని చెప్పారు నిఖిల్. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. దీంతో నిఖిల్ ట్వీట్ చేసిన కాసేపటికి హైదరాబాద్ టిసీ పోలీసులు స్పందించారు. డియర్ సర్.. మీ లొకేషన్ పంపించండి.. స్థానిక పోలీసు అధికారులతో మాట్లాడి మీకు ఈ పాస్ అందించేలా చూస్తామని రీ ట్వీట్ చేశారు పోలీసులు. ఐతే దీనికి నిఖిల్ మాత్రం స్పందించలేదు. ఇలా కరోనా బాధితుడికి మందులు ఇచ్చేందుకని చెప్పినా పోలీసులు అడ్డుకోవడం దారుణమని నెటిజన్స్ సిటీ పోలీసులపై మండిపడుతున్నారు.