మావోయిస్టు అగ్ర‌నేత ఆర్కే క‌న్నుమూత!

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, కీలక నేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే కన్నుమూశారు. ఆర్కే అలియాస్ అక్కిరాజు రామకృష్ణ చనిపోవడంతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగా అయ్యింది. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే అలియాస్‌ సాకేత్ దక్షిణ బస్తర్ అటవీ ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో ఆర్కే తుదిశ్వాస విడిచారని చెబుతున్నారు.

rk leadr minఅనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చత్తీస్గడ్ బస్తర్ రీజియన్ మాడ్ అటవీ ప్రాంతంలో మరణించినట్లుగా ఆ రాష్ట్ర డీజీపీతో పాటు బస్తర్ ఎస్పీ ధ్రువీకరించారు. పెరాల‌సిస్‌, లంగ్స్ ఇన్‌ఫెక్ష‌న్‌తో ఆయ‌న మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. ఆర్కే స్వస్థలం గుంటూరు జిల్లా తుమ్రుకోట‌. నాలుగు ద‌శాబ్దాలుగా మావోయిస్టు ఉద్య‌మంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఉద్య‌మ నేత‌గా మారిన స‌మ‌యంలోనే త‌న పేరును రామ‌కృష్ణ అలియాస్ ఆర్కేగా మార్చుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు. ఏపీ ఒడిశా స‌రిహ‌ద్దు ఇన్‌చార్జిగా కూడా ఉన్నారు. ఆర్కేపై ఇప్పటికే రూ. కోటి రివార్డు ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 2005లో శాంతి చర్చలకు నేతృత్వం వహించారు ఆర్‌కే. దేశ వ్యాప్తంగా ఆర్కేపై కేసులుండగా.. బలిమెల ఎన్‌కౌంటర్‌ నుంచి తృటిలో తప్పించుకున్నారు.

వరంగల్‌ నిట్‌లో బీటెక్‌ పూర్తి చేసిన ఆర్కే, నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా ఉంటూ పలు పదవుల్లో కొనసాగారు. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ప‌ద్మ‌జ‌ను ఆర్కే వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆర్కేతో పాటు ఉద్య‌మంలో ప‌నిచేశారు. ఉద్య‌మం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఆమె టీచ‌ర్‌గా ప‌నిచేశారు. ఆమెపై కూడా ప‌లు కేసులు ఉన్నాయి. ఆర్కే మావోయిస్టు పార్టీ టాప్ 3 నాయకుల్లో ఒకరు. మావోయిస్టు అగ్రనేతల్లో గణపతి, కిషన్ జీ తరువాత ఆర్కే ముఖ్యస్థానంలో ఉన్నారు. అలిపిరి దగ్గర అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన నక్సల్ దాడిలో ఆర్కే ప్రమేయం ఉంది. కాగా, ఆర్కే మృతి మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.