అనంతపురం- ప్రేమ.. ఈ రోజుల్లో చాలా సహజంగా వినిపించే పేరు. ఈ మధ్య కాలంలో స్కూల్ స్థాయి నుంచే ప్రేమించుకుని ఔరా అనిపిస్తున్నారు కొందరు. ఇక ఈ ఇంటర్నెట్ కాలంలోను పిల్లల ప్రేమకు పెద్దలు అడ్డుచెబుతూనే ఉన్నారు. ఇలా పెద్దలకు బయపడి పారిపోయి పెళ్లిచేసుకుందో ప్రేమ జంట.
సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఫేస్ బుక్ ద్వారా ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దలను ఎదిరించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు వారి వివాహాన్ని అంగీకరించకపోవడంతో వ్యవహారం పోలీసుస్టేషన్‌కు చేరింది. ఐతే ఆఖరికి తహసీల్దార్ కార్యాలయంలో ప్రేమ కధ సుఖాంతమైంది.
అనంతపురంలో స్థానిక మరువకొమ్మ కాలనీకి చెందిన రామకృష్ణ కుమార్తె మంజుల ధరణికి రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ లో బుక్కపట్నంకు చెందిన విజయ్ తో పరిచయం అయ్యింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్నాళ్లు ప్రేమించుకున్నాక, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 14న ఇంటి నుంచి వచ్చిన మంజుల ధరణిని.. విజయ్ బుక్కపట్నం తీసుకెళ్లి, అక్కడ గుడిలో పెళ్లి చేసుకున్నాడు.
తన కూతురు కనిపించకపోవడంతో కంగారు పడిన మంజుల ధరణి తండ్రి రామకృష్ణ ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మంజుల ధరణి కాల్ డేటా, లొకేషన్ ఆధారంగా ఆమె బుక్కపట్నంలో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి పోలీసులు గురువారం ఇద్దరినీ అనంతపురానికి తీసుకొచ్చారు.