పులి పంజా పవర్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ఇందుకే అడవిలో మరే ఇతర జంతువులు పులి జోలికి పోవు. ఇటుగా టైగర్ వస్తుంటే.., అన్నీ జీవులు అటుగా తల వంచుకు వెళ్లిపోతుంటాయి. అప్పుడప్పుడు సింహం మాత్రమే పులిని ఢీ కొడుతూ ఉంటుంది. కానీ.., ఓ కోతి పులి జోలికి పోయి బతకగలదా? అసాధ్యం అంటారు కదా? కానీ.., ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. ఇంకా చెప్పాలంటే అంతకు మించే జరిగింది. ఓ కోతి ఏకంగా 5 పులులతో కోరి సున్నం పెట్టుకుంది. అంతేకాదు.., వాటి చేత సర్కస్ ఫీట్స్ చేయించింది. ఆ విరాల్లోకి వెళ్తే.. అడవిలో ఎండ తాకిడిని తట్టుకోలేక ఓ పులుల గుంపు దాహాన్ని తీర్చుకోవడానికి కాలువలోకి దిగాయి. తమ పాటికి తాము జలకాలు ఆడుతూ సేద తీరుతూ ఉన్నాయిపులులు. ఇంతలో ఓ అల్లరి కోతి అటుగా వచ్చింది. మాములుగానైతే కోతి అక్కడ నుండి పారిపోవాలి. కానీ.., ఈ వానరం మాత్రం ఓ చెట్టుపైకి ఎక్కి.., ఆ కొమ్మలను పట్టుకుని ఆ పులులను కవ్వించసాగింది. ఇక ఆ కోతిని పట్టుకోవడానికి పులులు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. కోతి కొమ్మలను పట్టుకుని నాలుగు కాళ్లతో వేలాడుతూ ఉంటే.., ఆ పులులు మాత్రం పైకి కిందకి ఎగురుతూ అలసిపోయాయి. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా తన అధికారిక ట్విట్టర్‌లో షేర్ చేశారు. దీనితో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్స్ మాత్రం ఓవైపు కోతి చేష్టలకు నవ్వకుంటూనే, మరోవైపు కామెంట్స్ చేస్తున్నారు. మరీ కోతి వెర్రీ కాకపోతే…ఇంతలా ఉడికించాలా..?అని కొంతమంది అంటుండగా, ఈ కోతి అదృష్టం బాగుంది..అందుకే పులులకు చిక్కకుండా తప్పించుకుంది. దీని ఆయుష్యు గట్టిదే అంటూ మరికొంత మంది కామెంట్ చేయడం విశేషం.