జూన్ 30 వరకు రాష్ట్రాలలో కోవిడ్-19 ఆంక్షలు! ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర హోంశాఖ!

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. లాక్ డౌన్ , కర్ఫ్యూ వంటి ఆంక్షల నడుమ ప్రజా జీవనం కొనసాగుతున్నా.., పరిస్థితిల్లో చెప్పుకోతగ్గ మార్పులు కనిపించడం లేదు. వైద్య రంగంలో కాస్త మౌలిక సదుపాయాలు పెరగడం, ఎక్కడికక్కడ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడంతో అత్యవసర పరిస్థితిలు మాత్రం కాస్త అదుపులోకి వచ్చాయి. కానీ.., వైరస్ వ్యాప్తి మాత్రం అలానే ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్ మార్గదర్శకాలను జూన్ 30 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని అన్నీ రాష్ట్రాలు ఈ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో.., ఏప్రిల్ 29న జారీ చేసిన మార్గదర్శకాలు.. జూన్ 30 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా హోంశాఖ కార్యదర్శి మీడియాతో మాట్లాడారు. ఒకవైపు కొత్త కేసులు తగ్గుతున్నా, యాక్టివ్ కేసుల ఇంకా ఎక్కువగానే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో కోవిడ్ నిబంధనలను పాటించడం తప్ప మన దగ్గర మరో మార్గం లేదు. కోవిడ్ నియంత్రణ చర్యలు చేపట్టడం వల్లే కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని.., ఒకవేళ వీటిని బ్రేక్ చేస్తే పరిస్థితి మళ్ళీ చేయి దాటిపోతుందని అజయ్ భల్లా తెలియచేశారు.

kendram 2కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులు మేరకు.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, తాత్కాలిక ఆసుపత్రుల ఏర్పాటు విషయంలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించడానికి వీలు లేదు. అలాగే.., ప్రజలకి అంబులెన్స్లు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల పైనే ఉంది. ఇదే సమయంలో ఐసోలేషన్ వసతులతో పాటు అవసరమైన చర్యలు చేపట్టాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు సూచించింది. స్థానిక పరిస్థితులు, అవసరాలు, వనరులను అంచనా వేసిన తర్వాత రాష్ట్రాలు గాని, యూటీలు గాని ఏదైనా సడలింపులను తీసుకోవచ్చు. అది కూడా తగిన సమయంలో.. గ్రేడెడ్ పద్ధతిలో తీసుకోవాలి ఉంటుందని రాష్ట్రాలకు జారీ చేసిన ఉత్తర్వుల్లో కేంద్రం పేర్కొంది. దీంతో.., జూన్ లో కూడా అన్నీ రాష్ట్రాలలో కర్ఫ్యూ , కొనసాగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ కర్ఫ్యూ, లాక్ డౌన్ కారణంగా రోజువారీ కూలీలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉపాధి మార్గాన్ని కోల్పోయి, చేతిలో డబ్బులు లేక వారి పరిస్థితి దీనంగా తయారైంది. ఈ నేపథ్యంలోనే వీరిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు ముందుకి రావాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మరి రానున్న కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో ఎలాంటి చర్యలు చేపడతాయో చూడాలి.