భారతీయ చలన చిత్ర రంగంలో తన గానామృతంతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రస్తుతం భౌతికంగా మన మద్యలో లేకున్నా ఆయన పాడిన వేలాది పాటలతో అందరి హృదయాల్లో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. క్లాస్ సాంగ్ అయినా, మాస్ బీట్ అయినా, మెలోడీ సాంగ్ అయినా తన గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోస్తారు ఎస్పీ బాలు.
ఆయన పాట అంటే ప్రాణంగా భావించేవారు ఎందరో ఉన్నారు. ఎస్పీ బాలు పాట పాడుతుంటే మంత్రముగ్ధులై పోతారు. ఏ భాషలోనైనా పాటను అవలీలగా పాడేయగలరు ఎస్పీబాలు.. ఎన్నో వేల పాటలతో ఆయన తెలుగు సినిమా ప్రేక్షకులను మెప్పించారు. నిత్యం ఆయన పాటలను పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఓ దుబాయ్ షేక్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాట పాడిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. 1986లో వచ్చిన ఆల్ టైమ్ క్లాసికల్ సూపర్ హిట్ సినిమా ‘సిరివెన్నెల’. ఈ సినిమాతోనే ప్రముఖ పాటల రచయిత సిరివెన్నల సీతారామ శాస్త్రి ఎంతగానో పాపులర్ అయ్యారు.. అందుకే ఈ సినిమా పేరును తన ఇంటిపేరుగా పెట్టుకున్నారు.
ఈ చిత్రంలోనే సూపర్ హిట్ సాంగ్ ‘విధాత తలపున వికసించినది ఈ గీతం’ పాట వింటుంటే ఎలాంటి వారైనా తన్మయత్వంలో మునిగిపోతారు. బాలు పాడిన పాటకు దుబాయ్ షేక్ కూడా ఫిదా అయిపోయారు. అంతే కాదు ఈ పాటను పాడి అందరిచే ఔరా అనిపించుకున్నారు. ‘సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది..నే పాడిన జీవన గీతం.. ఈ గీతం.. విరించినై విరచించితిని ఈ కవనం..విపంచినై వినిపించితిని ఈ గీతం’ అంటూ చాలా స్పష్టంగా పాడి ఔరా అనిపించాడు. దుబాయ్ షేక్ నోట ఎస్పీ బాలు పాడిన పాట టిక్ టాక్ వీడియోను ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్లు వాట్సాప్, సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.