ఫిల్మ్ డెస్క్- తెలుగు సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని శోక సంద్రంలో ముంచింది. వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చేర్చించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.
సిరివెన్నెల సీతీరామ శాస్త్రి మరణ వార్త తెలిసి ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కే విశ్వనాధ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇది నమ్మలేని నిజం.. చాల పెద్ద లాస్ నాకు.. బాలసుబ్రమణ్యం పోయినపుడు కుడి భుజం పోతే, సిరివెన్నెల మరణంతో ఎడమ భుజం పోయింది.. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు.. ఎంతో సన్నిహితంగా ఉండే ఆయన ఒక్కసారే అంతర్దానం కావడం నమ్మశక్యంగా లేదు.. అన్నారు.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను.. ఇది చెప్పలేని ఒక సిచుయేషన్.. నేను ఇంతకన్నా ఏం మాట్లాడలేక పోతున్నా.. అని కే విశ్వనాధ్ అన్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రితో కె. విశ్వనాథ్ బంధం ఎంతో ప్రత్యేకమైందని చెప్పాలి. సీతారామ శాస్త్రిని, డైరెక్టర్ కే విశ్వనాధే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేశారు. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సిరివెన్నెల సినిమాలో మొట్టమొదటిసారి పాటలు రాయించారు.
తన పెన్ పవర్ ఏంటో తెలుగు సినీ పరిశ్రమకు రుచి చూపించిన ఆయన ‘సిరివెన్నెల’ సినిమాలో అన్ని పాటలు రాసి అదే పేరును ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఆయన అసలు పేరు చేంబోలు సీతారామ శాస్త్రి కాగా సిరివెన్నెల సినిమాలో పాటలు రాశాక సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా మారిపోయింది. అలా సిరివెన్నెల సీతారామ శాస్త్రితో అలుపెరగని ప్రయాణం చేసి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ రూపుదిద్దిన కె. విశ్వనాథ్ కు విడదీయరాని బంధం ఏర్పడింది. ఇక ఇప్పుడు ఆయన లేరన్న నిజాన్ని కే విష్వనాధ్ జీర్ణించుకోలేకపోతున్నారు.
Legendary director #KVishwanath garu reacts to sudden demise of #SirivennelaSitaramasastri 💔🙏#RIPSirivennelaSitaramaSastri pic.twitter.com/TwYOq6nxtj
— Suresh Kondi (@V6_Suresh) November 30, 2021