ప్రాణాలను లెక్కచేయని స్నేహం.. ఒక్కడిని కాపాడబోయి ముగ్గురు మృతి

beedar relangana

ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిన స్నేహితుడిని రక్షించబోయి మరో ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద సంఘ‌ట‌న బీద‌ర్ జిల్లాలో జ‌రిగింది. బీదర్‌ జిల్లా గోడివాడ దర్గా సమీపంలో ఉన్న చెరువులో హైదరాబాద్‌కు చెందిన నలుగురు మృతి చెందారు. ఈ విషాద సంఘటన ఆదివారం జరిగింది. సలీంబాబా నగర్‌ బస్తీకి చెందిన జునైద్‌ఖాన్‌ (21), అతని సోదరుడు ఫహాద్‌ఖాన్‌(16), ఆదే ప్రాంతానికి చెందిన సయ్యద్‌ జునైద్‌(16), కిషన్‌బాగ్‌ ప్రాంతానికి చెందిన హైదర్‌ఖాన్‌ (16)లు ఆదివారం గోడివాడి దర్గాకు కారులో బయలుదేరారు. 11 గంటల ప్రాంతంలో గోడివాడకు దర్గా వద్దకు చేరుకున్నారు.

పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ముందుగా హైదర్‌ వెళ్లగా అతను నీటిలో మునిగిపోతుండటాన్ని మిగతా ముగ్గురూ గమనించారు. అతన్ని కాపాడే క్రమంలో వీరు కూడా నీటిలో మునిగిపోయారు. చెరువులో నీరు ఎక్కువగా ఉండటం, వీరికి ఈత రాకపోవడంతో మృతిచెంది ఉంటారని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుస్తులు, గుర్తింపు కార్డుల ఆధారంగా గుర్తించారు. గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను వెలికి తీసి పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ నలుగురి మృతితో సలీంబాబా నగర్‌లో విషాదం నెలకొంది. కుటుంబస‌భ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: ఫోన్లో గేమ్స్‌ ఆడొద్దని మద్దలించిన తండ్రి.. దారుణానికి ఒడిగట్టిన కూతురు