రైలు వేగం కార‌ణంగా రైల్వే స్టేషన్ కార్యాల‌యం కూలిపోవ‌డం అనేది దేశంలో ఇదే తొలిసారి!..

 

ఎక్కడైనా రైలు గుద్దితే భవనం పడిపోతుంది. కానీ విచిత్రంగా రైలు స్పీడు ధాటికి రైల్వేస్టేషన్ కూలిపోవడం విడ్డూరమే కదా!. వేగంగా వెళుతున్న రైలు ధాటికి ప‌క్క‌నే ఉన్న రైల్వే కార్యాల‌యం కూలిపోవ‌డం గురించి ఎప్పుడూ వినివుండం. ఇటువంటి విచిత్ర ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. బుర్హాన్‌పూర్ జిల్లాలోని నేపానగర్ – అసిఘర్ మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ అధిక వేగంతో వెళ్తుండగా వ‌చ్చిన ప్రకంపనలకు చాందినీ రైల్వే స్టేషన్ భవనం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. ప్రమాదం జరిగిన స‌మ‌యంలో ఆ రైలు గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళుతోంది. ఈ రైలు ప్ర‌తీరోజూ ఇదేవేగంతో వెళుతుంటుంది. రైలు వేగం కార‌ణంగా రైల్వే కార్యాల‌యం కూలిపోవ‌డం అనేది దేశంలో ఇదే తొలిసారి.

ఈ భవనాన్ని 14 ఏళ్ల క్రిత‌మే నిర్మించారు. రైలు వెళుతున్న ప్పుడు వ‌చ్చిన ప్ర‌కంప‌న‌ల‌కు స్టేషన్ సూపరింటెండెంట్ కార్యాల‌యం కిటికీలు పగిలిపోయాయి. బోర్డులు కింద పడిపోయాయి. ప్లాట్‌ఫారంపై భ‌వ‌న శిధిలాలు చెల్లాచెదురుగా ప‌డ్డాయి. సమాచారం అందుకున్న ఎడిఆర్ ఎం మనోజ్ సిన్హా, ఖండ్వా ఎడిఎన్ అజయ్ సింగ్, భుసావల్‌కు చెందిన సీనియర్ డిఎన్ రాజేష్ చిక్లే త‌దిత‌రులు చాందినీ స్టేష‌న్‌కు చేరుకున్నారు. వారు అక్క‌డి ప‌రిస్థితుల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఈ ప్ర‌మాదం కార‌ణంగా ఈ మార్గంలో వెళ్లే రైళ్ల వేగాన్ని త‌గ్గించారు. చాందినీ రైల్వే స్టేషన్ దేశంలో అత్యంత రద్దీగా ఉండే ముంబై-ఢిల్లీ రైల్వే మార్గంలో ఉంది. భుసావల్ డిఆర్ ఎం వివేక్ కుమార్ గుప్తా తెలిపిన వివ‌రాల ప్రకారం చాందినీ స్టేషన్‌ భవనంలోని కొంత భాగం కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌పై రైల్వే ఉన్న‌తాధికారులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.