కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు వ్యవసాయ చట్టాలను తమ ప్రభుత్వం ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. రైతుల నుంచి వ్యతిరేకత ఎదురైన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీ నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రధాని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు.రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ చట్టాలు వారి ఆమోదం పొందలేకపోయాయని పవన్ తెలిపారు. ఈ నేపథ్యంలో మూడు చట్టాలను వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఉపసంహరిస్తామని ప్రకటించడం ఆయనలోని రాజనీతిజ్ఞతను చాటుతోందని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ప్రసంగం ఆద్యంతం పరిశీలిస్తే ప్రజల మాటే శిరోధార్యంగా భావించినట్టు అర్థమవుతోందని తెలిపారు. పోరాడితే సాధ్యం కానిది ఏదీ లేదని రైతుల ఉద్యమంతో నిరూపితమైందని అభిప్రాయపడ్డారు. రైతుల పోరాటాన్ని రాజకీయ కోణం నుంచి కాకుండా ఒక సామాజిక అంశంగా భావించి చట్టాలను ఉపసంహరించుకున్న బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు.