తిరుపతి- ఆంద్రప్రదేశ్ లోని తిరుపతిలో ఘోరం జరిగిపోయింది. స్థానిక రుయా ఆస్పత్రిలో విషాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ లోని కరోనా ఎమర్జెన్సీ వార్డులో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆక్సిజన్ అందక సుమారు 11 మంది కరోనా రోగులు చనిపోయారు. మరో 13 మంది కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రిలోని ఎం.ఎం. 1,2,3 వార్డులో ఆరుగురు, ఎం.ఎం.4,5,6లో ఒకరు, ఐసీయూలో ముగ్గురు మొత్తం పది మంది మృతి చెందారు. ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేపుడు కంప్రజర్ తగ్గటంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఐతే తిరిగి ఆక్సిజన్ సరఫరా మొదలుపెట్టినా పరిస్థితి అదుపులోకి రాలేదని రోగుల బంధువులు ఆరోపించారు. మొత్తం 45 నిమిషాల పాటు ఆస్పత్రిలో రోగులకు ఆక్సీజన్ సరఫరా నిలిచిపోయిందని తెలుస్తోంది. ఇక రోగుల బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.
మృతి చెందిన రోగుల బంధువులు ఐసీయూలోని వస్తువులను ద్వంసం చేశారు. దీంతో వైద్యులు, నర్సులు ఆస్పత్రి నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. రుయాస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల 11మంది చనిపోయారని కలెక్టర్ హరినారాయణన్ ప్రకటించారు. రాత్రి 10.45కు ఆస్పత్రిలో వైద్యులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆస్పత్రిలో 700 మందికి ఆక్సిజన్ పడకలపై చికిత్స అందిస్తున్నారని, ఐదు నిమిషాలు ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన అంతరాయం వల్ల కొంతమంది చనిపోయారన్నారు. చెన్నై నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు రావడంతో చాలా ప్రాణాలను రక్షించగలిగామన్నారు. పరిస్థితి అదుపులోనే ఉందని చెప్పారు.