తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మంచి మనసు చాటుకున్నారు. రెండు సార్లు కరోనా వచ్చినా గొప్ప పనికి పూనుకున్నారు. మహమ్మారి కారణంగా మానవత్వం ప్రశ్నార్థకంగా మారుతోంది.అనుబంధాలకు తావులేదంటే కలికాలమని చెప్పుకుంటూ వచ్చాం. కానీ ప్రస్తుతం నడుస్తున్న కరోనా కాలంతో పోల్చుకుంటే కలికాలమే లక్ష రెట్లు మేలTనే భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. పోయిన వాళ్లు ఎటూ తిరిగి రారని, తమను తాము రక్షించుకోవడం తక్షణ కర్తవ్యమనే భావనతో, సొంత వాళ్ల మృతదేహాలను కాటికి చేర్చలేని దయనీయ స్థితి. ఇలాంటి కష్ట కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తన మంచి మనసును చాటుకుంటున్నారు. ఇప్పటికే రెండు సార్లు కరోనా వైరస్ మహమ్మారి బారినపడినా కూడా.. మానవసేవే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు. తిరుపతి రుయాలో చనిపోయిన వారి పార్థివ దేహాలను సొంత కుటుంబ సభ్యులే తీసుకెళ్లలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యే భూమన అంతా తానై అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
గత కొన్ని రోజులుగా తిరుపతి రుయా ఆసుపత్రిలో కోవిడ్ బారిన పడిన 21 అనాథ శవాలకు ఎమ్మెల్యే నేతృత్వంలో పూలమాలలు వేసి, సంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించారు. మిత్రులతో కలిసి స్వయంగా మహా ప్రస్థానం, ముస్లిమ్ జేఏసీ వాహనాల్లో మృతదేహాలు వుంచి కడసారి వీడ్కోలు పలికారు. ఇలా కోవిడ్ మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రజాప్రతినిధుల్లో కరుణాకరరెడ్డి ఒక్కరే కనిపిస్తుండడం గమనార్హం.