హైదరాబాద్- తన మొత్తం ఆస్తులపై విచారణ జరిపించుకోవాలని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ప్రభుత్వానికి సవాలు విసిరారు. తనపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం వివరణ ఇచ్చారు. తాను తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమేనని, సన్యాసం కూడా తీసుకుంటానని అన్నారు. ఉన్నతాధికారులు, సిట్టింగ్ జడ్జితో కూడా కమిటీ వేసుకోవచ్చని ఘాటుగా స్పందించారు. ఈ ప్రభుత్వం నుంచి 5 పైసలు కూడా తీసుకోలేదని.. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని అన్నారు. ఈ చిల్లర రాజకీయాలకు ఈటల రాజేందర్ లొంగిపోడన్న ఆయన.. ఆస్తులు, పదవుల కోసం నేను లొంగిపోనని చెప్పారు. తన ఆత్మ గౌరవం కంటే ఈ పదవి గొప్పది కాదని.. 20 ఏళ్లలో ఏనాడూ తప్పు చేయలేదని అన్నారు. సీఎం ఈ విషయంలో పూర్తి స్థాయిలో విచారణ జరిపి సమాజానికి నిజాలు చూపించాలని వ్యాఖ్యానించారు.
పౌల్ట్రీకి ల్యాండ్ ఎక్కువగా కావాలని, విస్తరణ కోసం పరిశ్రమల శాఖకు అప్పట్లో లేఖ రాశానని వివరించారు. కెనరా బ్యాంకు ద్వారా తన పరిశ్రమ విస్తరణ కోసం వంద కోట్ల రుణం తీసుకున్నట్లు చెప్పారు. అది వ్యవసాయ భూమి కాదని, రైతులు స్వచ్ఛందంగా సరెండర్ చేస్తే, ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ద్వారా ఇవ్వొచ్చని చెప్పారని అన్నారు. ఒక ఎకరం కూడా తన స్వాధీనంలో లేదన్నారు ఈటెల రాజేందర్.