హోరాహోరీ పోరు.. సవాళ్లు, ప్రతిసవాళ్లు.. నువ్వెవరంటే నవవ్వెవరంటూ విమర్శలు. ఉత్కంఠగా సాగిన ‘మా’ కురుక్షేత్రంలో విజేత ఎవరో తెలిసిపోయింది. నూతన అధ్యక్షుడుగా మంచు విష్ణు గెలుపొందిన విషయం తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఈసారి పెద్ద యుద్ధమే జరిగింది. రెండు ప్యానళ్ల సభ్యులు హోరాహోరీగా పోటీ పడ్డారు. సూర్యాస్తమయం అవగానే యుద్ధాన్ని ఎలా అయితే ఆపేవారో.. అలాగే ఎన్నికలు ముగియగానే అందరూ శాంతించారు. అందరూ కలిసిపోయి ఒకే కుటుంబం అంటూ అభిమానులకు మంచి సందేశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో యువ హీరోలు కొందరు అసలు ఎన్నికలకు కూడా రాలేదు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రానా ఇలా చాలామందే గైర్హాజరయ్యారు. వారిలో బాగా వినిపించిన పేరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అసలు ఎందుకు నందమూరి తారకరామారావు ఎన్నికలకు రాలేదు అని కొందరు బాహాటంగానే ప్రశ్నించారు. అతను ఎన్నికలకు రాకపోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది.
‘మా’ ఎన్నికల్లో ఒకవైపు ‘ప్రకాశ్ రాజ్ ప్యానల్, మరోవైపు మంచు విష్ణు ప్యానల్. రెండు ప్యానళ్ల వారు కావాల్సినవారే. ఒకరికి మద్దతు ఇచ్చి మరొకరిని బాధపెట్టలేం. ఒకరికి వకాల్తా తీసుకుని మాట్లాడితే ఈ గొడవ ఇంకా పెద్దదవుతుంది. ఈ విషయాన్ని పెద్దది చేయకూడదు’ అన్న సదుద్దేశంతోనే ఎన్టీఆర్ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
వ్యక్తిగత దూషణలు, విమర్శలు, సవాళ్లు చాలానే నడిచాయి మా ఎన్నికల్లో. మాస్ ఫాలోయింగ్ బాగా ఉన్న ఎన్టీఆర్ అంశంపై స్పందించినా.. ఏదైనా కామెంట్ చేసినా.. ఆ గొడవ మరో స్థాయికి చేరుతుంది. ఎన్టీఆర్ అభిమానులు సైతం కామెంట్లు చేయడం మొదలుపెడితే చినికి చినికి గాలీవాన అవుతుందనే యంగ్ టైగర్ సైలెంట్‌గా ఉన్నాడు అని టాక్ వినిపిస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసుడిగానే కాకుండా.. ఎన్టీఆర్‌కు అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన ఆర్టిస్ట్‌గా బాధ్యతలు కూడా ఉన్నాయి. తన వల్ల ఎలాంటి వివాదం కాకూడదని.. వివాదాలు పెరగకూడదనే ఉద్దేశంతోనే నందమూరి తారకరామారావు మా ఎన్నికలకు దూరంగా ఉన్నాడని వినిపిస్తున్న అభిప్రాయం. ‘మా’ ఎన్నికల్లో యంగ్ హీరోలు పాల్గొనకపోవడంపై మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.