సినీ పరిశ్రమ మరో గొప్ప నటుడిని కోల్పోయింది. 1980వ దశకంలో దూరదర్శన్‌లో ప్రసారమైన ‘రామాయణ్’ ధారావాహికలో రావణుడి పాత్ర పోషించిన నటుడు అరవింద్ త్రివేది (82) కన్నుమూశారు. రామానంద్ సాగర్ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘రామాయణ్’. ఇందులో రావణాసురిడిగా అరవింద్ త్రివేది అద్భుత ప్రదర్శన ఇచ్చారు.
ఆయన కొవిడ్‌తో మృతి చెందారని కొద్ది రోజుల క్రితం నెట్టింట వరుస కథనాలు వచ్చాయి. ఈ విధమైన వదంతులను వ్యాప్తి చేస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. దయచేసి ఇలాంటి వాటిని ఇకనైనా ఆపండి. దేవుడి దయవల్ల అరవింద్ జీ ఆరోగ్యంగానే ఉన్నారు’ అని అప్పట్లో సునీల్ పేర్కొన్నారు. గత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి ముంబైలో తుది శ్వాస విడిచారు. మంగళవారం అర్థరాత్రి గుండెపోటు వచ్చిందని అరవింద్ త్రివేది మేనల్లుడు కౌష్తుబ్ త్రివేది తెలిపారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే లోపే తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆయన అంతిమ సంస్కారాలు బుధవారం ముంబైలోని కాండివాలి వెస్ట్‌లో ఉన్న శ్మశానవాటికలో జరుగుతాయన్నారు.
అరవింద్ త్రివేది 40 ఏళ్లపాటు గుజరాతీ చిత్ర పరిశ్రమలో ఆయన కొనసాగారు. రామయణ్ మాత్రమే కాదు.. ఈ విలక్షణ నటుడి విక్రమ్ ఔర్ బేతాళ్ సినిమాలో పాత్ర కూడా అందరికీ గుర్తుండిపోయింది. దాదాపు 300లకు పైగా హిందీ, గుజరాతీ చిత్రల్లో అరవింద్ త్రివేది నటించారు. అనేక సామాజిక, పౌరాణిక చిత్రాలలో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు.
1991 నుండి 1996 వరకు పార్లమెంటు సభ్యుడు కూడా త్రివేది పని చేశారు. సెన్సార్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)కు విజయ్ ఆనంద్ రాజీనామా చేసిన తరువాత కొంతకాలం తాత్కాలిక ఛైర్మన్ గా వ్యవహరించారు. అరవింద్ మృతి చెందాడనే విషయం తెలుసుకున్న సహా నటులు సునీల్ లాహిర్ (లక్ష్మణ్), దీపిక చిఖిలియా (సీత), అరుణ్ గోవిల్ (రామ్) మరియు ఇతరులు సంతాపం తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.