ఓం కరోనా ఫట్​, ఫట్ స్వాహా – గో కరోనా గో వెర్షన్​ 2.0!..

దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్​ను ఎలా తరిమికొట్టడమెలా? అని ప్రభుత్వాలు తలలు పట్టుకుంటుంటే కొంతమంది మంత్రగాళ్లు మాత్రం వెరైటీ మంత్రాలతో కరోనా కట్టడి చేస్తామంటూ రంగంలోకి దిగుతున్నారు. కరోనా ప్రారంభమైన మొదట్లో కొంతమంది మహిళలు బృందంగా ఏర్పడి ‘‘కరోనా భాగ్ జా” అని చేసిన నినాదాలు కూడా అప్పట్లో పాలపుర్​ అయ్యాయి. ఇటువంటి మంత్రాలు ప్రజల వెనుకబాటు తనాన్ని, మూడనమ్మకాల్ని గుర్తుచేస్తున్నాయని కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఓ మంత్రగాడు కరోనాను తరిమికొట్టడానికి ఏకంగా యజ్ఙం నిర్వహించి అందర్నీ ఆకర్షించాడు. ఓం కరోనా ఫట్​, ఫట్, ఫ్ట్​ స్వాహా అంటూ బిగ్గరగా అరుస్తూ మంత్రాలు జపించాడు. అతడు చేసిన యజ్ఞం ఇప్పుడు నెట్టింట్లో వైరల్​గా మారుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. యజ్ఞంతో కరోనా పోవడమేమో కానీ ఆయన మాత్రం ఈ వీడియోతో బాగా పాపులర్​ అయ్యాడు.

download 3

ఈ వీడియో ఇప్పటివరకు 42 వేలకు పైగా వ్యూస్​ సొంతం చేసుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో సదరు పూజారి ‘ఓం కరోనా భాగ్ స్వాహా’ అని నినాదాలు చేస్తూ యజ్ఞం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇక, ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్​ చేస్తున్నారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ వరిందర్‌చావ్లా షేర్ చేశారు. ‘గో కరోనా గో వెర్షన్​ 2.0’ అనే శీర్షికను జత చేశాడు. ఇదిలా ఉంటే, దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గినప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం పెరుగుతుంది. ప్రస్తుతం రోజువారీ కేసుల సంఖ్య 2.50 లక్షలకు పడిపోయినప్పటికీ, 4,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. సందట్లో సడేమియాలా ఈ స్వామీజీల లీలలూ పెరుగుతున్నాయి.  కేవలం బాబాలు, పూజారులే కాదు కొంత మంది రాజకీయ నాయకులు సైతం ఇలాంటి మంత్రాలు జపిస్తుండటం చర్చనీయాంశమైంది. గతేడాది కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే చేసిన ‘గో కరోనా గో’ నినాదం ఇంటర్నెట్​లో వైరల్​గా మారిన సంగతి తెలిసిందే.