సొరకాయ.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంట్లో సొరకాయ పచ్చడి, సొరకాయ పప్పు అనగానే ఓ నాలుగు ముక్కలు ఎక్కువ తినేవారు ఉంటారు. ఇక ఆరోగ్యం విషయానికొస్తే.. శరీరంలో వేడి ఎక్కువైనప్పుడు ఓ నాలుగు రోజులు తిన్నారనుకోండి.. బాడీ అంతా చల్లబడిపోతుంది.
సొరకాయ అనగానే అందరకీ గుర్తొచ్చేది.. ‘సాంబార్’. నాలుగు ముక్కలు సాంబార్ లో వేసి బాగా ఉడికించాక తింటుంటే ఆ రుచే వేరు. ఇక సొరకాయ పచ్చడి, సొరకాయ పప్పు ఎప్పుడూ తినేవే. వాటి రుచి కూడా మీరు చూసేవుంటారు. ఇలా రుచి ఒక్కటే కాదు.. సొరకాయలో ప్రోటీన్, థయామిన్, రైబోఫ్లావిన్ మరియు విటమిన్ సి పుష్కలంగా ఉండడం వల్ల వీటిని తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు. ముఖ్యంగా సొరకాయ శరీరానికి చల్లదనాన్నిస్తుంది. అధిక వేడిని బయటకు పంపి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
సాధారణంగా సొరకాయ అంటే.. అడుగు, అడుగున్నర, రెండడుగుల పొడవు ఉంటుంది. కానీ అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం శ్యాంపూర్లోని మురళీధర్ ఉన్న సొర పాదుకు.. భారీ పొడవున్న సొరకాయలు కాస్తున్నాయి. అవి ఏకంగా నాలుగైదు అడుగుల పొడవు ఉండటం గమనార్హం. చెట్టు నిండా కాయలు పడటం.. అన్నీ భారీ సైజులో ఉంటుండటంతో గ్రామస్తులు వీటిని ఆశ్చర్యంగా తిలకిస్తున్నారు. అలా అని మురళీధర్ కుటుంబసభ్యులు వీటిని అమ్మి సొమ్ము చేసుకోవట్లేరు. బంధువులకు, ఇరుగు పొరుగువారికి వచ్చి రుచి చూడమంటున్నారు. సొరకాయతో ఉండే గుజ్జు.. మలబద్ధకం, దగ్గు మరియు తేలికపాటి అంధత్వాన్ని అధిగమించడానికి చాలా మంచిది. అలాగే, కొన్ని విషాలకు విరుగుడుగా, కామెర్లను నయం చేయడానికి సొరకాయ ఆకు కషాయాలను ఉపయోగిస్తారు.