మా ఊరిలో వైన్ షాప్ వద్దు బాబోయ్ అని ధర్మాలు చేసి తీర్మానించిన గ్రామాలను చూశాం. కానీ అక్కడ మాత్రం మాకు వైన్ షాపులు కావాలని డిమాండ్ చేస్తూ ఏకంగా తీర్మానాలు చేసిన విచిత్ర పరిస్థితి చోటుచేసుకుంది.
పండుగలు, ఫంక్షన్లు, కష్టాలు, సంతోషాలు, గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ వీటిల్లో ఏది ఎదురైనా సరే ముందుగా మధ్యంతోనే సెలబ్రేట్ చేసుకుంటారు కొందరు వ్యక్తులు. బాధను, కష్టాన్ని మరిచిపోవడం కోసం కొందరు మద్యాన్ని సేవిస్తుంటారు. మధ్యపానం ఆరోగ్యానికి హాని చేస్తుందని హెచ్చరించినప్పటికి మద్యం ప్రియులు ఆ అలవాటును మానుకోరు. మధ్యం సేవించడం వల్ల అనారోగ్యంతో పాటు, కుటుంబాలు కూడా ఆర్థికంగా నష్టపోతున్నాయని పలువురు మద్యాన్ని నిషేదించాలని నిరసనలు వ్యక్తం చేసిన ఘటనలు మనం చూశాం. కానీ ఆ గ్రామంలో ఓ విచిత్ర పరిస్థితి చోటుచేసుకుంది. మా గ్రామంలో వైన్ షాప్ ఏర్పాటు చేయండంటూ గ్రామస్థులు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఆ వివరాలు మీకోసం..
మద్యం సేవించడంతో ఇళ్లు, ఒళ్లు రెండు గుళ్లవుతుండడంతోపాటు మద్యం మత్తులో నేరాలకు, అల్లర్లకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్ని గ్రామాల్లో మద్యం దుకాణాల వల్ల మా జీవితాలు సర్వ నాశనమవుతున్నాయని ఆగ్రహించిన మహిళలు, గ్రామస్తులు మద్యం షాపులను మూసేయాలని ధర్నాలు, మద్యం బాటిళ్లను ధ్వంసం చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. కానీ ఆ ఊరిలో మద్యం షాప్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులంతా ఒకచోటుకు చేరి గ్రామ సభ నిర్వహించుకుని తీర్మానించారు.
వివరాల్లోకి వెళ్తే.. ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు, వాగొడ్డుగూడెం గ్రామాల్లో మద్యం షాపులు లేవు. హైకోర్టు ఇచ్చిన స్టే కారణంగా మండలంలో గత 5 సంవత్సరాలుగా మద్యం షాపులు ఏర్పాటు చేయలేదు. దీంతో నిన్న (మంగళవారం) ఆ గ్రామాల్లోని స్థానికులు గ్రామ సభ పెట్టకున్నారు. ఆ గ్రామాల్లో వైన్ షాప్ లు ఏర్పాటు చేయాలని కోరుతూ తీర్మానం చేశారు. ఈ తీర్మానానికి ఆమోదం తెలుపుతూ చేతులు పైకి ఎత్తి తమ నిర్ణయాన్ని వెల్లడించారు. మరి వీరి నిర్ణయం పట్ల అధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.