రేపు పరీక్షలు అంటే హడావుడిగా ముందు రోజు ముఖ్యమైన ప్రశ్నలు బట్టీ కొట్టడం లేదంటే చిట్టీలు తీసుకువెళ్లడానికి ప్రయత్నించడం వంటివి చేస్తారు కొందరు విద్యార్థులు. అయితే చిట్టీలు తీసుకెళ్లడం నేరం. దొరికితే డీబార్ చేస్తారు అనే భయం. కానీ ఇక మీదట ఆ భయం అక్కర్లేదు.. ఇన్విజిలేటర్లే స్వయంగా పుస్తకాలు ఇచ్చి మరీ పరీక్ష హాల్లోకి పంపిస్తారు. ఎందుకో తెలియాలంటే..
ఓ విద్యార్థికి పరీక్ష పెట్టడం అంటే.. ఏడాది పాటు తరగతి గదిలో అతడు ఏం నేర్చుకున్నాడు.. ఏం గ్రహించాడు అనేది తెలుసుకోవడం కోసం నిర్వహించే ఓ తంతు. కానీ రాను రాను అని పెద్ద గండంలా మారింది. నేటి కాలంలో పరీక్ష అంటే.. ఉపాధ్యాయులు చెప్పింది అర్థం అయ్యిందా లేదా అనేది అనవసరం.. బట్టీ పట్టామా.. పరీక్షల్లో రాశామా.. మార్కులు తెచ్చుకున్నామా అంతే. ఆ తర్వాత ఏది గుర్తుండదు.. కేవలం పరీక్షల కోసం చదివిన చదువు. సరిగా గమనించారో లేదో.. పదో తరగతి, ఇంటర్, ఎంసెట్, కాంపిటీటీవ్ పరీక్షల్లో టాపర్‌గా వచ్చిన వారి పేర్లు తర్వాత ఎక్కడా కనిపించవు. కారణం. బట్టీ చదువులు అక్కడి వరకు మాత్రమే పనికి వస్తాయి. ఆ తర్వాత రాణించాలంటే సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన ఉండాలి. అలా చదివిన వారే జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. విద్యార్థులు సబ్జెక్ట్‌ను అర్థం చేసుకోవడం కోసం ప్రభుత్వం వినూత్న విధానం ప్రవేశపెట్టింది. ఆ వివరాలు..
ఇక పరీక్షల్లో కాపీ కొట్టడం.. చిట్టీలు తీసుకురావడం నేరం. కానీ ఇక మీదట పరీక్షల్లో చూసి రాయొచ్చు.. అవును మీరు విన్నది నిజమే. పరీక్ష హాల్‌కి పుస్తకాలు తీసుకెళ్లి.. చూసుకుంటూ ఆన్సర్స్ రాయొచ్చు. ఇన్విజిలేటర్లు ఏమనరు. ఈ వార్త వినగానే ఎగిరి గంతేయాలి అనిపిస్తుందా.. కదా. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. పుస్తకాలు చూసి మరీ పరీక్షలు రాసేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటికే గత నవంబర్‌లో ఈ విధనాన్ని అమలు చేసింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన పాలిటెక్నిక్ పరీక్షలో ఈ సరికొత్త పద్ధతిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది సాంకేతిక విద్యా మండలి. అప్లైడ్ ఇంజనీరింగ్ మేథమెటిక్స్ పేపర్ పరీక్ష రోజు అకడమిక్ పుస్తకాన్ని తీసుకెళ్లి.. చూసి పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసింది.
ఇక తాజాగా ఈ పరీక్షకు సంబంధించి ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ బుక్ చూసి రాశారు కదా.. అందరూ పాస్ అయి ఉంటారు అనిపిస్తుంది కదా. కానీ కేవలం 59 శాతం మంది మాత్రమే ఈ పరీక్షలో పాస్ అయ్యారు. అదేంటి చూసి రాయడానికి అనుమతి ఇచ్చారు కదా.. మరి ఇంత తక్కువ మంది పాస్ కావడం ఏంటి.. అంటే అక్కడే ఉంది అసలు కిటుకు. ఇలా చూచి రాయడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. ప్రశ్నలను నేరుగా కాకుండా పరోక్ష పద్దతిలో అడుగుతున్నారు. క్వశ్చన్ బ్యాంక్‌లో ఉన్నట్లుగా.. అకడమిక్ పుస్తకాల్లో ఈ ప్రశ్నలకు సమాధానాలు నేరుగా దొరకవు. విద్యార్థికి చాప్టర్ మొత్తం చదివి.. దాని మీద పూర్తి అవగాహన ఉన్నప్పుడు మాత్రమే సమాధానం రాయగలడు. అందుకే బుక్ చూసి రాయడానికి అనుమతి ఇచ్చినా సరే.. కేవలం 59 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు.
ఈ నూతన విధానం వల్ల బట్టీ పట్టి చదవడం తగ్గుతుందని.. విద్యార్థి పాఠాలను పూర్తిగా చదివి.. ఓ అవగాహనకు వస్తాడని.. అప్పుడే ఏ కోణంలో ప్రశ్న ఇచ్చినా సరే సమాధానం రాయగలడని నిపుణులు అంటున్నారు. పైగా ఈ ఒపెన్ బుక్ విధానంపై ముందునుంచే విద్యార్థులకు అవగాహన కల్పించడం వల్ల.. ఒక్క అంశాన్ని వివిధ కోణాల్లో ఆలోచించే విధానాన్ని అలవర్చుకుంటారని అంటున్నారు. బట్టీ పట్టే పద్ధతిని దూరం చేసి.. విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని పెంచడమే ఈ ఒపెన్ బుక్ ప్రధాన ఉద్దేశం అంటున్నారు నిపుణులు. అంతేకాక పరీక్ష హాల్లోకి మండలి సూచించిన అకడమిక్ పుస్తకాల్లో రెండింటిని మాత్రమే అనుమతిస్తారు. ఒపెన్ బుక్ విధానంలో విద్యార్థి ఆలోచనా శక్తి, నైపుణ్యాన్ని కొలవడానికి వీలుంటుంది అంటున్నారు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్‌ఎడ్యుకేషన్ కార్యదర్శి డాక్టర్ సి.శ్రీనాథ్.
ఈ విధానం తమకు పోటీ పరీక్షల్లో విజయం సాధించడానికి చాలా మేలు చేస్తుంది అంటున్నారు విదయా. ఇక ఇప్పటి వరకు కేవలం ఒక్క సబ్జెక్ట్‌కు మాత్రమే ఇలా చూసి రాసేందుకు అనుమతి ఇవ్వగా ఈ ఏడాది ఇదే తరహా విధానాన్ని మరికొన్ని సబ్జెక్ట్‌లకు వర్తింపచేయాలనే ఆలోచనలో ఉన్నారు అధికారులు. మరి ఈ నూతన విధానం వల్ల బట్టీ చదువులు కాకుండా విద్యార్థికి సబ్జెక్ట్ మీద అవగాహన పెరుగుతుందని మీరు భావిస్తున్నారా.. ఈ విధానం సరైందే అనుకుంటున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.