మీరు పోలీస్ ఉద్యోగాలకు అప్లై చేశారా.. తక్కువ ఎత్తు ఉన్న కారణంగా డిస్‌క్వాలిఫై అయ్యారా! అయితే, మీకో గుడ్ న్యూస్. ఫిజికల్ ఈవెంట్స్‌లో 1 సెంటిమీటర్ లేదా అంత కంటే తక్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. ఎవరైనా అలాంటి అభ్యర్థులు ఉంటే.. ఫిబ్రవరి 10 ఉదయం 8 గంటల నుంచి 12వ తేదీ రాత్రి 8 గంటల లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి అని సూచించింది. వీరికి అంబర్‌పేట పోలీసు గ్రౌండ్స్, కొండాపూర్ 8వ బెటాలియన్‌లో ఈవెంట్స్ నిర్వహించనున్నారు. దరఖాస్తు పారంతో పాటు అడ్మిట్‌కార్డును చూపించి, అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్‌లో పాల్గొనాల్సి ఉంటుంది.
కాగా, 16వేలకు పైగా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం టీఎస్ఎల్‌పీఆర్‌బీ చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఇప్పటికే ప్రిలిమినరీ, ఫిజికల్ ఈవెంట్స్ పూర్తి కాగా.. మెయిన్స్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే, మార్కులు కలపాలంటూ కొందరు, ఫిజికల్ ఈవెంట్స్‌లో ఎత్తు విషయంలో క్వాలిఫై కాని అభ్యర్థులు తమకు మరో అవకాశం కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. దీంతో 1 సెంటిమీటర్ లేదా అంత కంటే తక్కువ ఎత్తులో డిస్‌క్వాలిఫై అయిన అభ్యర్థులకు మరోసారి అవకాశం కల్పించాలని కోర్టు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది. ఈ క్రమంలోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.