తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని పాటించకపోతే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఆ వివరాలు..
చదువుల పేరుతో పిల్లల మీద ఎంత ఒత్తిడి తెస్తున్నామో తాజాగా ఏపీలో విద్యార్థులు ఆత్మహత్యతో మరోసారి వెలుగులోకి వచ్చింది. పరీక్షల్లో.. అది కూడా 1,2 సబ్జెక్ట్స్‌లో ఫెయిల్ అయిన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 9 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇక పరీక్షల ముందు తెలంగాణలో పలువురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం అయ్యింది. ఈ క్రమంలో తెలంగాణ ఇంటర్ బోర్డ్.. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. దీనిపై కమిటీ వేసి.. చర్చలు జరిపింది. అనంతరం ప్రైవేట్ జూనియర్ కళాశాలలకు తెలంగాణ ఇంటర్ బోర్డ్ మార్గదర్శకాలు జారీ చేసింది. కమిటీ సిఫార్సుల మేరకు గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఆ వివరాలు
ఇంటర్ బోర్డు అనుమతి పొందిన ప్రాంగణంలో మాత్రమే తరగతులు నిర్వహించాలని, ఇక ఇంటర్ కాలేజీలో పని చేసే సిబ్బందికి ఆధార్ సహిత బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని మధ్యలో తొలగించకూడదని, ప్రతి జూనియర్ కాలేజీకి ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్ ప్రత్యేకంగా ఉండాలని స్పష్టం చేసింది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో.. కాలేజీ ప్రిన్సిపల్‌ను మారిస్తే సంబంధిత అధికారులకు వెంటనే తెలియజేయాలని ఇంటర్ బోర్డు మార్గదర్శకాల్లో పేర్కొంది. కళాశాల పనివేళల్లో ఔట్‌సైడర్స్‌ను అనుమతించకూడదని, నిర్దేశించిన టైమ్‌లో మాత్రమే తల్లిదండ్రులను కలుసుకునేందుకు అనుమతించాలని సూచించింది.
ఎక్స్‌ట్రా క్లాస్‌లు.. మూడు గంటల కన్నా ఎక్కువ ఉండకూడదని.. అకడమిక్ క్యాలెండర్‌ను తప్పనిసరిగా ఫాలో కావాల్సిందేనని ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఇక కాలేజీకి సంబంధించిన హాస్టల్లో ఉండే విద్యార్థులకు 8 గంటల నిద్రకు అవకాశం ఇవ్వాలని ఇంటర్ బోర్డు మార్గదర్శకాల్లో పేర్కొంది. అంతేకాక ఉదయం బ్రేక్ ఫాస్ట్‌కు, రెడీ అవ్వడానికి గంట టైమ్ ఇవ్వాలని, సాయంత్రం రిఫ్రెష్‌మెంట్స్‌కు మరో గంట వ్యవధి ఇవ్వాలని ఇంటర్ బోర్డు సూచించింది. మధ్యాహ్నం, రాత్రి భోజనాలకు 45 నిమిషాల చొప్పున టైమ్ ఇవ్వాలని సూచించింది.
అలానే విద్యార్థి కాలేజీ మానేయాలి అనుకుంటే ఫీజు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించింది. స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అయిన మొదటి మూడు నెలలలోపు మానేసినట్లు అయితే 75 శాతం ఫీజు తిరిగి ఇచ్చేయాలని, మూడు నెలల నుండి 6 నెలలలోపు మానేస్తే.. 50 శాతం ఫీజు తిరిగి చెల్లించాలని.. తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల్లో ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. అలానే 6 నెలల తర్వాత కాలేజీ మానేసినట్లు అయితే 25 శాతం ఫీజు తిరిగి ఇవ్వాలని స్పష్టం చేసింది. విద్యార్థి మానేసిన వారం రోజులలోపు ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది.
అంతేకాక విద్యార్థులకు ప్రతి రోజు ఆటలు ఉండాలని.. సంవత్సరానికి రెండుసార్లు మెడికల్ చెక్ అప్ చేయించాలని ఆదేశాలు జారీ చేసింది. అలానే విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి చేసింది. అన్ని కాలేజీల్లో రాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని ఇంటర్ బోర్డు సూచించింది. మరీ ముఖ్యంగా చదువు పేరుతో, ఫీజుల పేరుతో విద్యార్థులను వేధించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మార్గదర్శకాలను అన్ని కాలేజీలు అమలు చేయాలని.. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరి ప్రభుత్వం తీసుకువచ్చిన మార్గదర్శకాలను.. ఇంటర్ కాలేజీలు పాటిస్తాయా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.