ఏ విద్యార్ధి అయినా కోరుకునేది ఏంటి.. చదువుతో పాటు ఆటలు, పాటలు, వినోదం. అయితే ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువు తప్ప వేరే యాక్టివిటీస్ ఉండవు. అడ్మిషన్ అప్పుడు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెబుతారు గానీ అందులో నిజం ఉండదు. ఎంతసేపూ చదువు,చదువు అని విద్యార్థుల మీద ఒత్తిడి పెంచుతారు. ఆ ఒత్తిడి వల్ల నిద్ర సరిపోదు. దీని వల్ల జీవితం మీద విరక్తి పుడుతుంది. అందుకే కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
కొని ప్రైవేటు స్కూళ్లు, ప్రైవేటు కాలేజీలు కేవలం చదువు, చదువు అని విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుంటాయి. ముఖ్యంగా ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఇంటర్మీడియట్ విద్యార్థులను చదువు పేరుతో ఒత్తిడి చేస్తుంటాయి. ఆ ఒత్తిడిని తట్టుకోలేక కొంతమంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇకపై ఇలాంటి ఆత్మహత్యలు ఉండకూడదని ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకోనుంది. విద్యార్థులకు చదువే కాకుండా మిగతా యాక్టివిటీస్ కూడా ఉండాలని ఆదేశాలు జారీ చేయనుంది. ఇంటర్ విద్యార్థులకు 8 గంటలు నిద్ర తప్పనిసరి చేయాలని కార్పొరేట్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల యాజమాన్యాలకు తెలంగాణ ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేయనుంది.
చాలామంది ఇంటర్ విద్యార్థులు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని.. నిద్ర ప్రాముఖ్యతను కార్పొరేట్ రెసిడెన్షియల్ కళాశాల యాజమాన్యాలకు తెలిపేలా ఈ నిర్ణయం తీసుకోవాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. సాయంత్రం సమయంలో స్టడీ అవర్స్ పొడిగించడంతో పాటు ఉదయం 5 గంటలకే విద్యార్థులు మళ్ళీ నిద్ర లేవడం, మరుసటి రోజు కూడా అవే టైమింగ్స్ ఉండడం వల్ల చాలా మంది విద్యార్థులు నిద్రకు దూరమవుతున్నారని.. ఇది వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందని ఇంటర్ బోర్డు గుర్తించింది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య క్లాసులు నిర్వహించాలని.. రాత్రి భోజనం తర్వాత గంట, రెండు గంటల పాటు మాత్రమే స్టడీ అవర్స్ నిర్వహించాలని ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు చేసింది.
అలానే ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీల్లో క్రీడలు, ఆటలు, వినోద కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వడం తప్పనిసరి చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తుంది. క్లాస్ అయిన తర్వాత సాయంత్రం వినోద కార్యకలాపాలు తప్పనిసరిగా ఉండాలని బోర్డు భావిస్తోంది. త్వరలోనే ఈ కొత్త మార్గదర్శకాలను ప్రైవేట్ రెసిడెన్షియల్ కాలేజీ యాజమాన్యాలకు సూచించనుంది. ఇటీవల నార్సింగిలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న సాత్విక్ అనే విద్యార్థి క్లాస్ రూమ్ లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. మార్కుల పేరుతో యాజమాన్యం సాత్విక్ ను ఒత్తిడికి గురి చేయడం, వేధింపులకు గురి చేయడం వల్లే బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే. దీంతో ఇంటర్ బోర్డు అప్రత్తమైంది.
ప్రైవేట్ కళాశాలల్లో అకడమిక్ సమస్యలు, ఇతర సమస్యలపై మార్గదర్శకాల రూపకల్పన కోసం 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పలు మార్గదర్శకాలను రూపొందించింది. విద్యార్థులకు నిద్ర, క్లాసులు అయ్యాక సాయంత్రం ఆటలు, వినోద కార్యకలాపాలు, రాత్రి భోజనం తర్వాత స్టడీ అవర్స్ తగ్గించడం వంటి వాటిపై దృష్టి సారించింది. అలానే టీవీలు, పత్రికల్లో కార్పొరేట్ కళాశాలలు ఇచ్చే తప్పుడు ప్రకటనపై కూడా బోర్డు కమిటీ దృష్టి పెట్టింది. మీడియాకు ప్రకటన ఇచ్చేటప్పుడు బోర్డు నుంచి అనుమతి తీసుకోవడాన్ని తప్పనిసరి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. కొన్ని కార్పొరేట్ కళాశాలలు తప్పుడు ప్రకటనలను ఇస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను ప్రభావితం చేస్తున్నాయని.. టాప్ ర్యంకులు ర్యాంకులు తమ కాలేజీకే వచ్చాయని ప్రకటనలు ఇస్తున్నారని బోర్డు భావిస్తోంది.
అందుకే విద్యార్థులకు వచ్చిన ర్యాంక్, హాల్ టికెట్ నంబర్ పరిశీలించిన తర్వాతే ప్రకటన వచ్చేలా బోర్డు చర్యలు చేప్పట్టనుంది. దీనికి సంబంధించి బోర్డు కమిటీ ఈ నెల చివరిలోపు సిఫార్సులు చేయనుంది. ఈ సిఫార్సులను పరిశీలించి ఇంటర్ బోర్డు ఆమోదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే ఇంటర్ విద్యార్థులకు చదువే కాకుండా ఆటలు, పాటలు వంటి వాటి వల్ల వినోదం అందుతుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుంది. అలానే వారు 8 గంటల పాటు తృప్తిగా నిద్రపోతారు. విద్యార్థులు చదువుతో పాటు కాసేపు ఆటలు కూడా ఆడుకోవచ్చు. ఇదే కదా విద్యార్థులకు నచ్చేది. మరి ఇంటర్ విద్యార్థుల సమస్యలపై బోర్డు తీసుకోనున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.