వీధి కుక్కల బెడద ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. దొరికిన వారిని దొరికినట్టుగా వెంటబడుతూ, కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలను.. ఒంటిరిగా ఉన్న సమయం చూసి దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా, కోహెడలో అలాంటి ఒకటి వెలుగుచూసింది.
ప్రజలకు వీధి కుక్కల బెడద ఇప్పట్లో తప్పేలా కనిపించడం లేదు. దొరికిన వారిని దొరికినట్టుగా వెంటబడుతూ, కరుస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న పిల్లలను.. ఒంటిరిగా ఉన్న సమయం చూసి దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా సిద్దిపేట జిల్లా, కోహెడలో అలాంటి ఒకటి వెలుగుచూసింది. వీధి కుక్కల దాడి నుంచి ఓ బాలిక తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. చిన్నారి గట్టిగా కేకలు వేయడం.. వెంటనే ఓ వ్యక్తి అప్రమత్తమై వాటిని తరిమికొట్టడంతో ప్రాణాలు కాపాడుకోగలిగింది కానీ, ఏదైనా జరగరానిది జరిగుంటే.. మరో విషాద ఘటనను చూడాల్సి వచ్చేది.
సిద్దిపేట జిల్లా, కోహెడ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉంటున్న 9 ఏళ్ల బాలిక(చిన్ని) పాలు తీసుకురావడానికి ఇంటి నుంచి షాపునకు వెళ్తోంది. ఆ సమయంలో బాలిక ఒంటిరిగా వెళ్తుండడాన్ని గమనించిన రెండు కుక్కలు ఆమెను వెంటపడ్డాయి. వాటిని చూసి భయపడ్డ ఆ చిన్నారి వెంటనే పరుగు అందుకుంది. పరుగులు పెట్టడంతో అవి కూడా చిన్నారిని వెంటాడాయి. దీంతో మరింత భయాందోళనలకు గురైన ఆ చిన్నారి గట్టిగా కేకలు వేస్తూ పరుగు పెట్టడం మొదలుపెట్టింది. ఆ కేకలు విన్న ఓ మెకానిక్.. వెంటనే పరుగున వచ్చి తన చేతిలో ఉన్న వస్తువుతో వాటిని తరిమి కొట్టాడు. దీంతో అవి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి.
ఈ భయానక దృశ్యాలు చూశాక స్థానికులు, చిన్నారి తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు. చిన్నారి ప్రాణాలు కాపాడిన మెకానిక్ కు కృతజ్ఞతలు తెలిపారు. గత కొద్దిరోజుల నుండి కోహెడ మండల కేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని, గ్రామపంచాయతీ సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఈ ఘటన చూశాకైనా ప్రభుత్వ అధికారుల్లో, సిబ్బందిలో మార్పు వస్తుందేమో చూడాలి. వీధి కుక్కల బెడదని అరికట్టాలంటే.. ఎలాంటి చర్యలు తీసుకోవాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.