తెలంగాణ సీఎంవో ప్రత్యేక కార్యదర్శి.. స్మితా సభర్వాల్ ఇంట్లోకి.. అర్థరాత్రి వేళ అనుమతి లేకుండా.. ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్రవేశించిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మేడ్చల్ డిప్యూటీ ఎంఆర్ఓ ఆనంద్.. తన ఉద్యోగం గురించి మాట్లాడాలంటూ.. ఏకంగా స్మితా సభర్వాల్ ఇంటి వద్దకే వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారిణి నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా.. డైరెక్ట్‌గా ఆమె నివాసం వద్దకు వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటనపై స్మితా సభర్వాల్ స్పందించారు. ఇది ఎంతో బాధకరమైన అనుభవం అన్నారు.
దీనిపై స్మితా సభర్వాల్ స్పందిస్తూ.. ‘‘అర్థరాత్రి బాధాకరమైన అనుభం ఎదురయ్యింది. ఓ ఆగంతకుడు నా ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. ఆ సమయంలో నేను ఎంతో కంగారు పడ్డాను. కానీ ధైర్యం కోల్పోకుండా.. చాకచక్యంగా వ్యవహరించి.. నన్ను నేను రక్షించుకోగలిగాను. ఎంత భద్రత ఉన్నా.. మన్నల్ని మనం కాపాడుకునేలా ఉండగలగాలి. రాత్రివేళ తలుపులు, తాళాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. అత్యవసర పరిస్థితిలో.. వెంటనే 100కు కాల్ చేయాలి’’ అని స్మితా సభర్వాల్ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది వైరలవుతోంది.
Had this most harrowing experience, a night back when an intruder broke into my house. I had the presence of mind to deal and save my life.
Lessons: no matter how secure you think you are- always check the doors/ locks personally.#Dial100 in emergency— Smita Sabharwal (@SmitaSabharwal) January 22, 2023
స్మితా సభర్వాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. ఈ క్రమంలో మేడ్చల్ డిప్యూటీ ఎంఆర్ఓ ఆనంద్.. గతంలో రెండు మూడుసార్లు.. స్మితా సభర్వాల్ చేసిన ట్వీట్లను రిట్వీట్ చేశాడు. ఆమెతో పరిచయం పెంచుకుని.. తన ఉద్యోగం గురించి మాట్లాడాలని భావించి.. రెండు రోజుల క్రితం ఏకంగా స్మితా సభర్వాల్ ఇంటి దగ్గరకే వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతకుడిని చూసి స్మితా సభర్వాల్ షాకయ్యారు. ఎవరు నువ్వు.. ఈవేళప్పుడు ఎందుకొచ్చావ్ అని గట్టిగా ప్రశ్నించారు. ఇక డిప్యూటీ ఎంఆర్ఓ తీరు అనుమానాస్పదంగా ఉండటంతో గట్టిగా కేకలు వేశారు. దాంతో భద్రతా సిబ్బంది వచ్చి అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.