పోలీసులు అంటే లాఠీ చేత పట్టుకొని గంభీరంగా ఉంటారని, వారు ప్రతి చిన్న విషయానికి ప్రజలపై అధికారం ప్రదర్శిస్తారని చాలా మందిలో ఉండే అభిప్రాయం. కొందరు పోలీసులు చేసే అతి పనుల వలన పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది. నిజాయితీగా ఉండే వారికి కూడా ఆ మచ్చ అంటుతుంది. వాస్తవంగా పోలీసుల్లో చాలా మంది మానవత్వం కలిగి ఉంటారు. వారి కఠినమైన మాటతీరు వెనుక మానవత హృదయం దాగిఉంటుంది. ఎన్నో సందర్భాల్లో పోలీసులు ప్రజలకు సహాయపడటం చూస్తాం. తాజాగా ఓ ఎస్సై చేసిన పనికి అందరు ఫిదా అయ్యారు. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలో మంగపేట మండలం శనిగకుంట గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 25 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి. అయితే బాధితుల్ని పరామర్శించేందుకు మంత్రి సత్యవతి రాథోడ్ వచ్చారు. ఇదే సమయంలో సెక్యురిటీలో భాగంగా స్థానిక మంగపేట ఎస్సై తాహెర్ బాబా డ్యూటీలో ఉన్నారు. బాధితుల్ని మంత్రి పరామర్శిస్తున్న సమయంలో మేష లక్ష్మి అనే వృద్ధురాలు వడదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయి.. అపస్మారకస్థితిలోకి చేరుకుంది. అక్కడే విధుల్లో ఉన్న ఎస్సై తాహెర్ ఆలస్యం చేయకుండా తానే స్వయంగా ఆమెను ఎత్తుకుని దగ్గర్లో ఉన్న వైద్యశిబిరంకి తీసుకెళ్లారు. చికిత్స చేయించారు. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
అయితే అక్కడ చాలా మంది నాయకులు, ఆ వృద్ధురాలి బంధువులు ఉన్నప్పటికి కూడా ఎస్సై వెంటనే స్పందించారు. ఆమె కోసం ఎస్సై పరుగు పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. తన కింది స్థాయి వారికి చెప్పి మంత్రి దగ్గర విధులో ఉండి పోవచ్చు. కానీ ఆ ఎస్సై అలా చేయలేదు. ఆమెకు సత్వరమే చికిత్స అందేలా చేసి ప్రాణాలు కాపాడారు. దీంతో స్థానికుల నుంచి ఆ ఎస్సైకి అభినందనలు వెల్లువెత్తాయి. మరి.. ఈఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.