వివాహబంధంతో ఒక్కటైన జంటని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తారు పెద్దలు. పెళ్లి బంధంతో ఒక్కటైన దంపతులు ఎన్ని కష్టాలు వచ్చినా.. ఒకరికొకరు తోడూ నీడగా ఉంటారు.
భారతీయ సంప్రదాయాల్లో వివాహబంధానికి ఎంతో విశిష్టత ఉంది. ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతారు. వేదమంత్రాల సాక్షిగా బంధుమిత్రుల సమక్షంలో ఒక్కటైన జంటను నిండా నూరేళ్లు పిల్లాపాపలతో వర్ధిల్లాలని దీవిస్తుంటారు. పెద్దల సాక్షిగా మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.. పెళ్లైనప్పటి నుంచి భర్తనే ఆమె లోకం.. భర్తే దైవం గా భావించింది. ఎన్ని కష్టాలు వచ్చినా భార్యాభర్తలు ఒకరినొకరు విడిచి ఉండలేదు.. గడ్డు పరిస్థితుల్లో సైతం భర్తకు వెన్నుదన్నుగా నిలిచింది ఆ భార్య. అతనికి కూడా భార్యే సర్వస్వం.. ఆమె లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించుకోలేడు… పెళ్లినాటి నుంచి కలిసి మెలిసి అన్యోన్యదంపతుల్లా జీవించారు. మరణంలోనూ ఆ బంధం వీడిపోలేదు.. మైలారం గ్రామానికి చెందిన వృద్ద దంపతులు ఒకేరోజు కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
కరీంనగర్ మైలారం గ్రామానికి చెందిన ములుగు రాయమల్ల (75) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం కన్నుమూశాడు. భర్త మృతిని తట్టుకోలేని కన్నీరు మున్నీరైన భార్య చిలుకమ్మ (70) మనోవేధనకు గురై అదే రోజు రాత్రి కన్నుమూసింది. వృద్దాప్యంలోనూ ఒకరికొకరు తోడుగా ఉంటూ గ్రామంలో ఆదర్శంగా జీవించిన వృద్ద దంపుతుల చావుతో గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ వృద్ద దంపతును ఒకే చితిపై ఉంచి ఘనంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు ఊరి ప్రజలు.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. పెళ్లిబంధంతో ఒక్కటైన జంట చావులోనూ ఒకరినొకరు వీడిలేక తనువు చాలించారు. భర్త మృతి తట్టుకోలేక భార్య.. భార్య మరణం తట్టుకోలేక భర్త కొద్ది గంటల్లోనే కన్నుమూసిన ఘటనలు ఉన్నాయి. ఆ మద్య పశ్చిమ గోదావరి జిల్లాలో పోడూరు మండలంలోని పది నిమిషాల వ్యవధిలోనే ముప్పిడి పెదవీరన్న, ఆశీర్వాదం వృద్ధ దంపతులు మృతిచెందారు.