తన పెదనాన్న ఇచ్చిన లక్ష రూపాయల డబ్బులను ఎగ్గొట్టేందుకు ఓ యువకుడు భారీ స్కెచ్ వేశాడు. అంతా పక్కగా జరుగుతుందనే సమయంలో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఆ యువకుడి ప్లాన్ అంతా రివర్స్ అయి.. చివరకు జైలు పాలయ్యాడు.
ప్రతి ఒకరికి ఏదో ఒక సందర్భంలో అప్పు తీసుకుని పరిస్థితి వస్తుంది. అయితే చాలా మంది తాము తీసుకున్న అప్పును తిరిగి ఇచ్చేస్తుంటారు. మరికొందరు మాత్రం తాము తీసుకున్న డబ్బులను ఎలా ఎగ్గొట్టాలా? అని ఆలోచిస్తుంటారు. ఇంకా దారుణం ఏమిటంటే కొందరు డబ్బుల కోసం కుటుంబ సభ్యులను, ఇతర బంధువులనే బురిడీ కొట్టిస్తుంటారు. తాజాగా ఓ యువకుడు కూడా తన పెద్దనాన్న ఇచ్చిన అప్పును ఎగ్గొట్టేందుకు కోసం భారీ స్కెచ్ వేశాడు. అయితే పోలీసు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ రివర్స్ అయింది. మరి.. అసలు ఆ భారీ మోసం ఏంటి.. సీన్ రివర్స్ కావడం ఏంటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
హైదరాబాద్ లోని ఉప్పుగూడ ప్రాంతంలో సాయిబాబా నగర్ లో రమేష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే ప్రాంతంలో రమేష్ పెదనాన్న కూడా తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన కూడా కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రమేష్.. తన పెదనాన్న వద్ద మూడేళ్ల క్రితం లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే ఇటీవల కొంతకాలం నుంచి ఆ అప్పు తిరిగి ఇవ్వమని రమేష్ పెదనాన్న.. అతడిపై ఒత్తిడి తెస్తున్నాడు.
ఈ క్రమంలో డబ్బులను ఎగ్గొట్టేందుకు రమేష్ కిడ్నాప్ డ్రామా ఆడాడు. గత నెల28న సాయంత్రం ఆటోలో దేవతల గుట్ట సమీపంలోని ఆర్సీఐ రోడ్డు వద్దకు వెళ్లి.. తానే చేతులు, కాళ్లు వైర్లతో కట్టేసుకున్నాడు. ఒక చేతిని లూజుగా కట్టేసుకుని నోట్లో గుడ్డు పెట్టుకున్నాడు. ఆ తరువాత కిడ్నాప్ చేసినట్లు అందరిని నమ్మించేందకు గట్టిగా అరుస్తూ వీడియోలు, ఫోటోలు తీస్తున్నాడు. అదే సమయంలో అటుగా కళ్యాణ్ అనే వ్యక్తి వెళ్తూ.. రమేశ్ పరిస్థితిని గమనించాడు. వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు రమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఎవరు కిడ్నాప్ చేశారంటూ రమేష్ ను పోలీసులు ప్రశ్నించారు.
తన పెదనాన్న, ఆయన కుమారుడు సురేష్ కలిసి తనను కిడ్నాప్ చేసి.. హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు రమేశ్ తెలిపాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసు దర్యాప్తు చేపట్టారు. రమేష్ పెదనాన్న కుమారుడు సురేష్ ఫోన్ లోకేషన్లను ట్రేస్ చేశారు. కిడ్నాప్ జరిగిందన్న సమయంలో అతడి ఫోన్ లోకేషన్ గుంటూరులో ఉన్నట్లు చూపించింది. దీంతో రమేశ్ పై పోలీసులకు మరింత అనుమానం వచ్చింది. తమదైన శైలిలో ప్రశ్నించగా అసలు నిజం చెప్పాడు. తన పెదనాన్న ఇచ్చిన డబ్బులను ఎగ్గొట్టేందుకు తానే ఇలా చేసినట్లు రమేశ్ ఒప్పకున్నాడు. అయితే గతంలో కూడా రమేష్ ఇలాగే ఒక కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు విచారణలో తేలింది. దీంతో పోలీసులు రమేశ్ ను అరెస్ట చేసి రిమాండ్ కు తరలించారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.