హుజురాబాద్ బై పోల్‌కు షెడ్యూల్ విడులైన సంగతి తెలిసిందే. నేడు నోటిఫికేషన్ విడుదల కానుండగా ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనున్నారు. ఇటీవల మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజారాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. టీఆర్ఎస్ కి గుడ్ బాయ్ చెప్పిన ఈటెల బీజేపీ లో చేరిపోయారు. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీజేపీ తరపున పోటీ చేస్తుండగా అధికార టీఆర్ఎస్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఖరారు కాలేదు. నలుగురు పేర్లతో హైకమాండ్‌కు లిస్ట్ పంపించారు. ఇక అక్కడినుంచి ఆమోద ముద్ర రాలేదు.
ఇదిలా ఉంటే.. ఓ పక్క అధికార టీఆర్ఆర్, బీజేపీ అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల కాక ముందు నుండే నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపు కోసం ఇరు వర్గాలు గట్టి పట్టుమీదనే ఉన్నాయి. ఇక మాజీ మంత్రి కొండా సురేఖ ను పోటీకి దింపాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ.. కొండా సురేఖ మాత్రం తాను పోటీ చేయాలంటే కొన్ని కండీషన్లు పెట్టినట్టు సమాచారం. రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో వరంగల్లు ఈస్ట్ నియోజకవర్గ టికెట్ ను తమ కుటుంబానికి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ దామోదర రాజ నర్శింహ, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ తదితరులు సుదీర్ఘంగా చర్చించారు.
మరోవైపు పోటీలో కాంగ్రెస్ పార్టీ తరుపున మాజీ మంత్రి కొండా సురేఖ, పత్తి కృష్ణారెడ్డి, రవికుమార్, కన్వంపల్లి సత్యనారాయణ పేర్లను ఇప్పటికే అధిష్టానానికి పంపారు. అయితే కొండా పెట్టిన కండీషన్లపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో ఆమె పోటీకీ దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి చెప్పినట్లు సమాచారం. పోటీ చేయలేనని పార్టీకి తేల్చి చెప్పారు కొండా సురేఖ. ఇప్పటికే పక్క పార్టీ వాళ్లు అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారాల్లో దూసుకు వెళ్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విషయంలో అలసత్వం కొంప ముంచుతుందన్న టెన్షన్ లో ఉన్నారు కాంగ్రెస్ పెద్దలు. కొండా సురేఖ పోటీ చేయలేనని స్పష్టం చేయడంతో పత్తి కృష్ణారెడ్డి, రవి కుమార్ పేర్లను పార్టీ పరిశీలిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అభ్యర్థి పేరను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.