చాదర్‌ఘాట్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాత టైర్ల గోదాంలో మంటలు అంటుకోవడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకుని చీకటిమయం అయ్యింది.
నగరంలో వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలకు భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఒక ప్రమాదం నుంచి తేరుకునేలోపే మరొకటి జరుగుతూ.. నగరవాసుల్లో కలవరం సృష్టిస్తున్నాయి. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట డెక్కన్ మాల్ ఘటన మరవక ముందే, బోయిన్ పల్లి పరిధిలోని ఓ అపార్టుమెంట్లో అంటుకున్న చుట్టుపక్కలకు వ్యాపించడంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. తాజాగా, చాదర్‌ఘాట్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. టైర్ల దుకాణానికి సంబంధించిన పాత గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడడంతో.. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకుని చీకటిమయం అయ్యింది.
వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో ఫైరింజన్లు హుటాహుటిన అక్కడికి చేరుకున్నా.. ట్రాఫిక్ కారణంగా టైర్ల దుకాణం దగ్గరికి మాత్రం చేరుకోలేకపోయాయి. వెంటనే ట్రాఫిక్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని చాదర్‌ఘాట్ ప్రధాన రోడ్ నుంచి ట్రాఫిక్‌ను ఇతర రూట్లకు మళ్లించారు. దీంతో ఫైరింజన్లు టైర్ల గోదాం వద్దకు చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.