కాలం మారింది, పరిస్థితులు మారాయి, అభివృద్ధి జరిగింది. కానీ, ఇంకా ఎక్కడో ఆడపిల్ల చదువు అనగానే చిన్నచూపు కనిపిస్తూనే ఉంది. నీకు చదువెందుకమ్మ? చదివి ఏం సాధిస్తావు ఏ అయ్య చేతులోనే పెడతాం కదా.. అనే మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఆర్థిక భారం కానివ్వండి, ‘ఆడ’పిల్లేగా అవసరం ఏముందిలే అనుకోనివ్వండి.. కారణం ఏదైనా ఆ చిన్నారి చదువు ముందుకు సాగడం లేదు. అలా వద్దు ఇంకెందుకు అని ఆపేయమన్న తల్లిదండ్రులను బతిమాలి, ఒప్పించి ముందుకెళ్లిన ‘గడీల అనోధ’ డీఈఈ సెట్‌లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది.
అనోధది కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం బోడపల్లి గ్రామం. తల్లిదండ్రులు తిరుపతి-రాజేశ్వరిలకు వ్యవసాయమే జీవనాధారం. వారికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి ఉన్నారు. వారికున్న రెండెకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పెద్దమ్మాయికి పెళ్లి చేశారు. అప్పుడు చేసిన అప్పులే ఇంకా తీర్చలేక ఇబ్బంది పడుతున్నాడు తిరుపతి. ఊరిలో ఎనిమిది వరకే ఉండటంతో రెండో అమ్మాయిని తర్వాత ఇంక చదువెందుకమ్మ.. పొలం వస్తే మాకు సాయంగా ఉంటుందిగా అని కోరారు. అందుకు అంగీకరించని అనోధ.. శంకర్రావు అనే మాస్టారి సాయంతో వారి ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇట్యాల ప్రభుత్వ పాఠశాలలో చేరింది. 2019లో 9.3 గ్రేడింగ్‌తో పది పూర్తి చేసింది.
మళ్లీ చదువెందుకమ్మ అనే ప్రశ్న వినిపించింది. మళ్లీ శంకర్రావు మాస్టారు నచ్చజెప్పి దహెగాం కస్తూర్బా కళాశాలలో ఎంపీసీలో చేర్పించారు. ఇంటర్‌లో 973 మార్కులతో కళాశాలలో మొదటి ర్యాంకు సాధించింది. టీచింగ్ అంటే ఆసక్తి ఉన్న గడీల అనోధకు ఉపాధ్యాయులు డీఈఈ సెట్ రాయాల్సిందిగా సూచించారు. కోచింగ్ తీసుకునేందుకు స్తోమతలేని అనోధ తెల్లవారుజామున 3 గంటల నుంచి ఇంట్లోనే చదువుకుంది. ఫలితంగా స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. వద్దన్న అమ్మానాన్నలు శభాష్ అనోధ అనేలా కష్టపడి చదివింది.
‘ఆడ’పిల్ల అన్న భావనతో వారి చదువుని చులకనగా చూడకండి. వంటింటి కుందేలు అనే ముద్ర నుంచి వనితకి కాదేదీ అసాధ్యం అనే వరకు చేరుకున్నారు. వీధి చివరకు కూడా వెళ్లలేదు అనుకునే స్త్రీ విశ్వమంతా చుట్టి వస్తోంది. మగపిల్లలు చదువుకోవాలి.. అందుకు ఆడపిల్లల చదువును బలి చేయకండి. అంతటా మార్పు వస్తున్నా.. ఎక్కడో ఇంకా అదే మూస ధోరణి కనిపిస్తోంది. అలాంటి వారికి ‘గడీల అనోధ’ విజయం ఒక కనువిప్పు కావాలి. అవకాశం, ప్రోత్సాహం ఉంటే ప్రతి అమ్మాయి ఓ ‘అనోధ’ కాగలదు. ఆడపిల్ల చదువు ఇంటికి భారం కాదు.. కొన్ని తరాలకు వెలుగవుతుంది.
ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.