హైదరాబాద్ నగరంలోని పబ్బులు, శివార్లలోని రిసార్టులు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. డ్రగ్స్ వినియోగం, అశ్లీల నృత్యాలతో రేవ్ పార్టీలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. పోలీసులు వీటిపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తునే ఉన్నారు. అయినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బంజారాహిల్స్ లోని “ఫుడింగ్ అండ్ మింక్ పబ్” పై పోలీసులు దాడితో మరొసారి రేవ్ పార్టీలు బహిర్గతమయ్యాయి. రామ్ గోపాల్ పేటలోని క్లబ్ టెకీలపై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్ లోని ఓ పబ్ స్థానిక పోలీసులు ఆదివారం తెల్లవారు జామున దాడి చేయడంతో ఈ పబ్ ల కేంద్రంగా జరుగుతున్న డ్యాన్స్ ల వ్యవహారం బయటపడింది.
పబ్స్‌లో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాల్లో దేశ, విదేశీ యువతులతో చేయించే క్యాబరేలు నయా ట్రెండ్‌గా మారాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి పబ్స్ నిర్వాహకులు ఇలాంటి కార్యకలాపాలు తెర తీస్తున్నారు. వివిధ నగరాలకు చెందిన యువతలతో పాటు టూరిస్టు వీసాలపై విదేశీ యువతుల్ని కూడా నగరానికి తీసుకొచ్చి..వారి అందాలను ఎరగా వేసి రెండు చేతులా దళారులు ఆర్జిస్తున్నారు. పర్యాటకం ముసుగులో సాగుతున్న ఈ వ్యాపారం వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఎప్పుడైనా వీటిపై దాడులు జరిగినప్పుడు యువతులే పట్టుబడుతున్నారు తప్ప అసలు సూత్రధారులు మాత్రం తప్పించుకుంటున్నారు.
ఇదీ చదవండి: ఓల్డ్ సిటీలో క్షుద్ర పూజల కలకలం.. స్మశానంలో భయంకర దృశ్యాలు!
ఈ అనధికారిక క్యాబరేల్లో నర్తించడానికి వస్తున్న విదేశీ యువతుల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్, ఉజ్బెకిస్తాన్ మొదలైన దేశాలకు చెందిన వాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. వారికి, వారి నృత్యాలకు ఉన్న డిమాండ్‌ను బట్టి ఢిల్లీ, ముంబై, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. అనంతరం వీరితో పబ్‌లు, క్లబ్బుల్లో అశ్లీల ప్రదర్శనలు ఇప్పిస్తూనే కస్టమర్లను విటులుగా మార్చుకుని మరోపక్క వ్యభిచారం కూడా చేయిస్తున్నారు. విదేశీయ యువతులపై ఉన్న క్రేజ్ ను బట్టి గంటకో రేటు కట్టీ మరీ వసూలు చేస్తున్నారు.
ఇందులో యువతులకు దక్కేది మాత్రం తక్కువే. ఈఘటనలపై ఓ పోలీసు ఉన్నతాధికారి స్పందింస్తూ..”వరుసగా వెలుగులోకి వస్తున్న ఉదంతాల నేపథ్యంలో నగరంలోని పబ్స్‌పై డేగకన్ను వేశాం. ఇప్పటి వరకు డ్రగ్స్ పైనే దృష్టి ఉండేది. ఇకపై ఇలాంటి డ్యాన్సుల విషయాన్నీ, అసాంఘిక కార్యకలాపాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తాం. నిర్ధేశిత సమయానికి మించి నడుస్తున్న పబ్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం” అని తెలిపారు.