వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి.. నిత్యం ఏదో ఓ వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుక కోరకడంతో ఐసీయూలో ఉన్న రోగి మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే ఆస్పత్రిలో మరో దారుణం చోటు చేసుకుంది. చేయి విరిగిందని ఆస్పత్రికి వెళ్లిన చిన్నారి.. ఏకంగా అనంతలోకాలకి వెళ్లాడు. ప్రస్తుతం ఈ సంఘటన వివాదాస్పదంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పుల్లయ్యబోడు, లింగ్యాతండాకు చెందిన భూక్య శివ, లలిత దంపతుల చిన్న కుమారుడు నిహాన్. మూడు రోజుల క్రితం జరిగిన ఓ ప్రమాదంలో నిహాన్ కుడి చేయి విరిగింది.
దాంతో నిహాన్ తల్లిదండ్రులు బాలుడిని ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో మంగళవారం నిహాన్‌కు సర్జరీ చేయాలని చెప్పిన వైద్యులు.. ఉదయం 10.30 గంటలకు బాలుడిని ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. అక్కడ మత్తు మందు ఇస్తుండగా.. బాలుడికి అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్ అయినట్లు వైద్యులు గుర్తించారు. వెంటనే ఆర్‌ఐసీయూ వార్డుకి తరలించారు. అక్కడ నిహాన్‌కు కృత్రిమ శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చిన్నారి నిహాన్ మృతి చెందాడు.
మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత నిహాన్ మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆ వార్త విన్న బాలుడి తల్లిండ్రులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. పది గంటల ప్రాంతంలో చేయికి సర్జరీ చేయడానికి లోపలకికి తీసుకెళ్లి.. మూడు గంటల తర్వాత తమ బిడ్డ మృతి చెందాడని ప్రకటించడం ఏంటి.. అసలు లోపల ఏం జరిగింది అంటూ వైద్యులుపై దాడి చేసేందుకు సిద్ధపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. వారు అడ్డుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయాడని నిహాన్ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బాలుడి మృతికి గల కారణాలపై విచారణకు సీనియర్ వైద్యులతో త్రిసభ్య కమిటీని వేసినట్లు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్‌రెడ్డి ఎంజీఎం సిబ్బందిని ఆదేశించారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.