తెల్లారితే ఆధ్యాత్మిక జీవితం, చీకటి పడితే మాత్రం రాక్ స్టార్ అయిపోతారు. పగలంతా స్వామి అని పిలిపించుకుంటూ.. రాత్రి మాత్రం అమ్మాయిల రాకుమారుడు అయిపోతారు. ఖరీదైన కార్లలో షికార్లు, పక్కన అమ్మాయిలు, పబ్బుల్లో జల్సాలు అబ్బో స్వామి వారి లైఫ్ స్టైల్ వేరే లెవల్. ఆయన మరెవరో కాదు, చినజీయర్ స్వామి వారి మేనల్లుడు అంటూ ఓ ప్రముఖ మీడియా ఛానల్ కథనం వెల్లడించింది.
పగలంతా యోగి, రాత్రైతే భోగి. పగలంతా సందేశాత్మక బోధనలు, చీకటి పడితే మందు, చిందు, విలాసాలు. పొద్దున్న దైవజనులు అంటూనే చీకటి పడ్డాక క్లబ్బులు, పబ్బులు, అమ్మాయిలు అంటూ మత్తులో మునిగి తేలుతారు. ఈ లోకం మత్తులో పడొద్దని చెబుతూనే.. స్వామీజీలు, బాబాల ముసుగులో కొంతమంది మత్తులో తూలి తేలుతుంటారు. పగలు ఒక వేషం కట్టి, రాత్రి వేషం మార్చే దొంగ స్వాములు, దొంగ బాబాలు, దొంగ పాస్టర్లు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. పగలంతా మడి బట్టలు కట్టుకుని ఆధ్యాత్మిక చింతనతో ఉంటూ.. రాత్రి కాగానే జీన్స్, టీషర్ట్, అమ్మాయిలు, లగ్జరీ కార్లు, మందు, సిగరెట్ బ్యాచ్ తో స్నేహం అబ్బో ఒకటేమిటి జల్సా రాయుడులా నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న స్వామి ఒకరు ఉన్నారంటూ ప్రముఖ మీడియా ఛానల్ కథనం ప్రసారం చేసింది.
ఆయన ఎవరో కాదు త్రిదండి చినజీయర్ స్వామికి స్వయానా మేనల్లుడు అయిన విష్ణు స్వామి. చినజీయర్ స్వామి సోదరి కుమారుడైన విష్ణు స్వామి.. ఆశ్రమ వ్యవహారాలు చూసుకుంటారు. ఆశ్రమంలో చినజీయర్ తర్వాత విష్ణు స్వామి మాటే చెల్లుతుంది. చినజీయర్ స్వామికి అన్నీ విష్ణు స్వామినే. ఆశ్రమంలో విష్ణు స్వామిని చిన్న స్వామి అని అంటారు. తెల్ల రంగు ధోవతి, ఉత్తరీయం ధరించి పూజలు చేస్తూ బుద్ధిమంతుడిలా కనిపించే విష్ణు స్వామిలో మరో కోణం కూడా ఉందని సదరు మీడియా ఛానల్ వెల్లడించింది. రాత్రైతే జల్సా రాయుడు గెటప్ లోకి మారిపోతారని, జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వేసుకుని లగ్జరీ కార్లలో అమ్మాయిలతో కలిసి నైట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారని తెలిపింది.
కార్లను వేగంగా నడపడం, స్నేహితులతో కలిసి పబ్ లకు వెళ్లడం.. మద్యం, సిగరెట్ తాగే వారితో కలిసి ఎంజాయ్ చేయడం.. చెవులు చిల్లుపడేలా మ్యూజిక్ ని ఆస్వాదించడం ఈయన రాత్రి పూట చర్యలు అంటూ చెప్పుకొచ్చింది. రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటే ఏ వాహనం వివరాలైనా ఆన్ లైన్ లో ఇట్టే తెలుసుకోవచ్చు. వాహన యజమాని పేరు, చిరునామా వంటివి వస్తాయి. కానీ విష్ణు స్వామి తిరిగే కారు వివరాలు మాత్రం కనిపించవు. వాహన యజమాని పేరు స్థానంలో నల్ అని కనిపిస్తుంది. ఆయన కారు నంబర్ ఏపీ 37 సీయూ 0999 అయితే సున్నా తీసేసి కేవలం ఏపీ 37 సీయూ 999గా ఉంచారు. అందుకే తెలంగాణ చలానా వెబ్ సైట్ లో యజమాని పేరు కనిపించదు. నిజానికి ఇలా ఒక నంబర్ ని తొలగించడం రవాణా శాఖ నిబంధనలను ఉల్లఘించినట్టే అవుతుంది అంటూ కథనం రాసుకొచ్చింది.
సదరు మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే.. ఈయన కారు బీఎండబ్ల్యూ ఎక్స్ 5. దీని ధర కోటి పైనే ఉంటుంది. ఇప్పటి వరకూ ఈ వాహనం మీద మూడు చలానాలు పడ్డాయి. ఏప్రిల్ 19న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపకుండా పోనిచ్చినందుకు రూ. 135 చలానా పడింది. మే 4న అవుటర్ రింగ్ రోడ్ మీద తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ వద్ద అతి వేగం, డేంజరస్ డ్రైవింగ్ కింద నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో రూ. 1035 చలానా పడింది. మే 12న చెన్నమ్మ హోటల్ వద్ద అతివేగం, డేంజరస్ డ్రైవింగ్ కింద రాజేంద్ర నగర్ పీఎస్ లిమిట్స్ లో రూ. 1035 చలానా పడింది. ఇంత వరకూ ఆ చలానా కట్టలేదు. అసలు చలానా పడిందన్న విషయం తెలిసో లేదో. మొత్తానికి విష్ణు స్వామి పగలంతా పూజలు, రాత్రైతే రాజభోగాలతో యువరాజులా జీవిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అయితే స్వామి ఇలా తయారవ్వడానికి కారణం కొందరు వ్యక్తులే కారణమంటూ సదరు ఛానల్ తెలిపింది. ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహం ఏర్పాటైన తర్వాత ఆశ్రమం చుట్టుపక్కల భూముల ధరలు పెరిగాయి. ఆశ్రమానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గరగా ఉండడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ పుంజుకుంది. రీసెంట్ గా 111 జీవో ఎత్తివేయడంతో ఆశ్రమానికి ఇరువైపులా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆశ్రమానికి రియల్ ఎస్టేట్ వ్యాపారుల రాకపోకలు పెరగడం, వెంచర్లు, విల్లాల ప్రారంభోత్సవానికి చినజీయర్ స్వామి వారిని ఆహ్వానించడం జరుగుతున్నాయి. అదే సమయంలో విష్ణు స్వామికి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల పరిచయాలు ఏర్పడ్డాయని.. అదే ఆయనను విలాస పురుషుడిగా మార్చిందన్న వార్తలు వస్తున్నాయి.
చినజీయర్ స్వామి మేనల్లుడు అన్న కారణంగా భూవివాదాలు కూడా పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఇవే విష్ణు స్వామిని పక్కదారి పట్టించినట్లు ప్రసారం చేసింది. పబ్ లు, క్లబ్ లు, లగ్జరీ కార్లలో తిరగడం, అమ్మాయిలు, విలాసాలు వంటివి అలవాటు అవ్వడానికి రియల్ సంబంధాలే కారణమన్న ప్రచారం జోరుగా సాగుతోందని రాసుకొచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తుపాకీ పట్టుకుని సినిమాల్లో హీరోలు తిప్పినట్టు తిప్పుతారు. పువ్వులు, కొబ్బరికాయలు పట్టుకునే చేతులతో తుపాకీ పట్టుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే కుర్రాళ్ళకి ఆ మాత్రం సరదాలు గట్రా ఉండవా అన్న వాళ్ళూ లేకపోలేదు. ఆ యువకుడికి కూడా కొన్ని అభిరుచులు ఉంటాయని, అది అతని వ్యక్తిగత జీవితమని అనే వాళ్ళు ఉన్నారు.
కానీ మద్యం, మాంసం వంటివి మనిషిని క్రూరుడ్ని చేస్తాయి, హంగులూ, ఆర్భాటాలు మనిషికి ఉండకూడదు అని చెప్పే చినజీయర్ స్వామి మేనల్లుడే ఇలా చేయడం కరెక్ట్ కాదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. చినజీయర్ స్వామితో పాటు పూజలు చేసే చేతులు.. కారు స్టీరింగ్ పట్టుకుని వేగంగా నడుపుతూ పబ్ లకి వెళ్లడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోందని అంటున్నారు. ఖరీదైన కార్లు, షికార్లు, లగ్జరీ లైఫ్ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటితే చెడ్డ పేరు దాటిన వ్యక్తికే కాదు, అతని కుటుంబ సభ్యులకు కూడా వస్తుందని అంటున్నారు. బాధ్యతలు గుర్తుచేసే స్థానంలో ఉన్న వ్యక్తులు, పది మందికి ఆదర్శప్రాయులుగా ఉండాల్సిన వ్యక్తులు ఇలా ఉండడం సమాజానికి అంత మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.