ఏదైనా గేమ్ ఆడుతున్నాం అంటే ముందు రూల్స్ తెలుసుకోవాలి. ఆ తర్వాత పోటీలో దిగాలి. లేదంటే తిప్పలు తప్పవు. కొన్నిసార్లు మధ్యలోనే ఔట్ అయిపోవాల్సి వస్తుంది. దీంతో ఉన్న పరువు కాస్త పోతుంది. ఇక క్రికెట్ విషయానికొస్తే.. బ్యాటింగ్, బౌలింగ్ కరెక్ట్ గా చేస్తే సరిపోదు. ఐసీసీ నిర్ణయించిన ప్రతి నిబంధన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మైదానంలో అడుగుపెట్టే విషయం నుంచి ఔటయ్యే వరకు చాలా రూల్స్ రూపొందించింది. ఇప్పుడు అలాంటిది ఒకటి తెలీక పాక్ ప్లేయర్ తిప్పలు పడ్డాడు!
ఇక వివరాల్లోకి వెళ్తే.. టీ20 వరల్డ్ కప్ ఆస్ట్రేలియాలో జరుగుతోంది. అన్ని జట్లు కూడా సెమీస్ చేరే ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో పాక్ జట్టు 33 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో వింత సంఘటన జరిగింది. ఐసీసీ నిబంధనలు తెలియకపోవడంతో పాక్ బ్యాటర్ నవాజ్.. నాటౌట్ అయినా సరే ఔట్ అనుకుని పెవిలియన్ కు చేరాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. రూల్స్ గురించి మరీ ఆ మాత్రం కూడా అవగాహన కూడా లేకపోతే ఎలా అని నెటిజన్స్ ఏకి పారేస్తున్నారు.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో పాక్ బ్యాటింగ్. 13వ ఓవర్ ని షంసీ వేశాడు. చివరి బంతికి నవాజ్ ని వికెట్ల ముందు దొరబుచ్చుకున్నాడు. అప్పీలు చేయగా అంపైర్ ఔట్ గా ప్రకటించాడు. అయితే బంతి, బ్యాట్ ఎడ్జ్ ని తాకిన తర్వాత ప్యాడ్ ని తాకింది. ఇక సఫారీ ఫీల్డర్లు అప్పీలు చేసే లోపు.. అదే బంతికి నవాజ్ రన్ కోసం ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అతడిని రనౌట్ చేశారు. తాను రనౌట్ అయ్యానని భావించిన నవాజ్.. రివ్యూ ఏం అడగకుండానే పెవిలియన్ కి వెళ్లిపోయాడు. ఔట్ అయిపోయాడు. ఇక్కడ అతడికి తెలియని విషయం ఏంటంటే.. అంపైర్, బ్యాటర్ ని ఔట్ గా ప్రకటిస్తే ఆ తర్వాత ఏం జరిగినా లెక్కలోకి రాదు. నవాజ్ విషయానికొస్తే.. ఎల్బీడబ్ల్యూ తర్వాత రనౌట్ అయ్యాడు. ఐసీసీ రూల్స్ ప్రకారం ఇక్కడ ఎల్బీ విషయంలో రివ్యూ తీసుకుంటే నాటౌట్ అయ్యేవాడు. పాపం.. ఆ విషయం తెలీక పెవిలియన్ చేరాడు. నెటిజన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.