క్రికెట్ మ్యాచ్ లో ప్రతీ ఓవర్.. ప్రతీ బాల్ కీలకమే. ఏ బాల్ ఏ క్షణాన మ్యాచ్ ను మలుపు తిప్పుతుందో తెలీదు. మెున్న పాక్ తో మ్యాచ్ లో నో బాల్ ఆట స్వరూపాన్నే మార్చేసిన విషయం మనకు తెలిసిందే. అలాగే మ్యాచ్ లో రనౌట్లు కూడా మ్యాచ్ గెలుపోటములపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. అలాంటి రనౌట్లు క్రికెట్ చరిత్రలో కోకొల్లలు. తాజాగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో కూడా ఓ రనౌట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిందని చెప్పొచ్చు. 21 బంతుల్లోనే అర్దశతకం బాది.. టీమిండియా బౌలర్ల పై యుద్దాన్ని ప్రకటించిన లిటన్ దాస్ ను కేఎల్ రాహుల్ అద్భతమైన త్రోతో రనౌట్ చేశాడు. దాంతో టీమిండియా మ్యాచ్ పై పట్టు బిగించింది.
కేఎల్ రాహుల్.. గత కొంత కాలంగా ఫామ్ లేమితో సతమతవుతున్నాడు. దాంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ ఈ మ్యాచ్ లో తన మునపటి ఫామ్ ను అందుకొని 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. అయితే బ్యాటింగ్ లోనే కాక ఫీల్డింగ్ లో సైతం అద్భుతం చేశాడు రాహుల్. 7 ఓవర్లలో బంగ్లా వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. లిటన్ దాస్ అప్పటికే భారత బౌలర్లకు చుక్కు చూపిస్తూ.. 26 బంతుల్లో 59 పరుగులతో ఉన్నాడు. ఈ క్రమంలోనే వర్షం రావడంతో మ్యాచ్ కు కొంత సమయం అంతరాయం కలిగింది. అనంతరం 16 ఓవర్లకు మ్యాచ్ ను కుదించి 151 పరుగులుగా బంగ్లా లక్ష్యాన్ని నిర్దేశించారు అంపైర్లు.
అనంతరం వర్షం తగ్గిన తర్వాత అశ్విన్ వేసిన 7వ ఓవర్ రెండో బంతిని షాంతో డీప్ మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు. ఒక రన్ సునాయసంగానే కంప్లీట్ చేసిన షాంతో-దాస్ లు రెండో రన్ కు ప్రయత్నించగా.. బాల్ ను అందుకున్న రాహుల్ డైరెక్ట్ గా వికెట్లకు విసిరాడు. అప్పటికి లిటన్ దాస్ క్రీజ్ లోకి చేరుకోలేకపోయి అవుట్ అయ్యాడు. దాంతో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోంది. అయితే వర్షం కారణంగా ఫీల్డ్ చిత్తడిగా మారడంతో.. రాగానే లిటన్ దాస్ ఓ సారి మైదానంలో జారి పడ్డాడు. ఆ తర్వాతనే దాస్ రనౌట్ గా వెనుదిరగడం ఇక్కడ గమనించాల్సిన అంశం. లిటన్ దాస్ నిష్క్రమించడంతో క్రమం తప్పకుండా బంగ్లా వికెట్లు కోల్పోతూనే ఉంది. ఇక తన సూపర్ త్రోతో మ్యాచ్ స్వరూపాన్నే మలుపు తిప్పాడు రాహుల్. అటు బ్యాటింగ్ తో.. ఇటు ఫీల్డింగ్ తో విమర్శకులకు సమాధానం ఇచ్చాడు కేఎల్ రాహుల్. ప్రస్తుతం ఈ రనౌట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.