సుదీర్ఘ కెరీర్లో ఎన్నో మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్, రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. తన ఫ్యాన్స్‌కు ఒక ఎమోషనల్ వీడియో రిలీజ్ చేశాడు. మోకాళ్ల ఆపరేషన్ అనంతరం తనకు చాలా నొప్పిగా ఉందని.. త్వరగా కోలుకోవడానికి మీ దీవెనలు కావాలంటూ అభ్యర్థించాడు. ఆస్ట్రేలియాలో మోకాళ్లకు శస్త్రచికిత్స చేయించుకున్న అక్తర్… ఆపరేషన్ తర్వాత తన పరిస్థితి వివరిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్టు చేశాడు. అందులో చాలా ఎమోషనల్ అయ్యాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయి 11 ఏళ్లు గడుస్తున్నా.. ఈ నొప్పితో ఇంకా ఇబ్బంది పడుతున్నట్లు పేర్కొన్నాడు. స్పీడ్ బౌలింగ్ వల్ల ఎముకలు అరిగిపోతాయని, ఇలాంటి తీవ్రమైన నొప్పి భరించాల్సి ఉంటుందని.. అయినా పాకిస్థాన్ కోసం మరోసారి ఆడమన్నా ఆడతానంటూ దేశంపై తన ప్రేమను చాటుకున్నాడు. కాగా.. ఇప్పటికే తన మోకాళ్లకు నాలుగైదు చిన్న చిన్న ఆపరేషన్లు అయినట్లు.. బహుషా ఇదే తన చివరి సర్జరీని.. దీంతో మోకాళ్ల ఆపరేషన్ పూర్తి అవుతుందని భావిస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ నొప్పి తట్టుకుని, త్వరగా కోలుకోడానికి మీ ప్రార్థనలు, దీవెనలు తనకు కావాలంటూ అక్తర్ తన అభిమానులను కోరాడు. ప్రస్తుతం అక్తర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతని అభిమానులు, క్రికెట్ ఫ్యాన్స్ అక్తర్ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు. 1997లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన అక్తర్.. 46 టెస్టుల్లో 178 వికెట్లు పడగొట్టాడు. అలాగే 163 వన్డేల్లో 247, 15 టీ20ల్లో 19 వికెట్లు తీశాడు. మరి అక్తర్ ఎమోషనల్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.