దిగ్గజ సచిన్ పేరు చెప్పగానే అద్భుతమైన బ్యాటింగ్ మనకు గుర్తొస్తుంది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సచిన్ కి అసలు ఇంత క్రేజ్ ఎలా వచ్చింది? ఏంటనేది తెలియాలా అయితే ఈ స్టోరీ చదివేయండి.
ఎక్కడైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి దేవుడు మనుషుల రూపంలో వస్తాడు అంటారు. కానీ.., కొన్ని దశాబ్దాల పాటు ఇండియన్ క్రికెట్ టీమ్ కష్టాల్లో ఉన్న ప్రతిసారీ జట్టుని ఆదుకోవడానికి ఆ దేవుడే స్వయంగా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్ లోకి వచ్చేవాడు!
5 అడుగుల 4 అంగుళాల ఎత్తు,
రింగులు తిరిగిన జుట్టు,
ప్రశాంతంగా కనిపించే మొహం,
చేతిలో వజ్రాయుధాన్ని తలపించే ఓ క్రికెట్ బ్యాట్,
అలా ఆయన క్రీజ్ లోకి వస్తుంటే భారతీయుల హృదయాలు పులకించిపోయేవి.
ఆ దేవుడి పేరే సచిన్ రమేశ్ టెండూల్కర్!
100 కోట్ల మంది భారతీయుల కలలని, అంచనాలని.. 24 సంవత్సరాల పాటు చిరునవ్వుతో భరించిన ఆ క్రికెట్ దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.సచిన్.. అప్పట్లో ఎక్కడ పట్టినా ఈ పేరే వినిపించేది. ఎవరు పట్టినా సచిన్ గురించే మాట్లాడుకునేవారు. ఇండియా మ్యాచ్ గెలుస్తుందా? ఓడిపోతుందా? అని అడిగే వారి కన్నా.. సచిన్ ఉన్నాడా? ఔట్ అయ్యాడా? అని అడిగే వారే ఎక్కువ. సచిన్ క్రీజ్ లో ఉంటే చాలు.. మ్యాచ్ మనదే అనే నమ్మకం అది. సచిన్ కొట్టే కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్, రివర్స్ స్వీప్, హుక్ షాట్, అప్పర్ కట్స్ చూడటంలో ఉండే మజా.. కోట్ల మందిని టీవీల ముందు కట్టి పడేసింది. ఒక క్రికెట్ మ్యాచ్ కి ఇంత టి.ఆర్.పి వస్తుందా అని ఇంటెర్నేషనల్ స్పోర్ట్స్ ఛానెల్స్ బిత్తరపోయేలా చేసింది. మా మ్యాచ్ టెలికాస్ట్ చేయండి ప్లీజ్ అంటూ.. ఛానెల్స్ కి డబ్బులు కట్టే స్థాయి నుండి.. ఈరోజు ఒక్కో మ్యాచ్ కోసం కోట్ల రూపాయలు ఛానెల్స్ నుండి డబ్బులు తీసుకునే రేంజ్ కి బీసీసీఐ ఎదిగింది అంటే అదంతా సచిన్ చలవే. ఇలా.. కేవలం సచిన్ కారణంగానే ఇండియాలో ఒక క్రికెట్ ఒక మతం అయ్యింది. ఆయనే క్రికెట్ దేవుడు అయ్యాడు.
సచిన్ సెంచరీ.. భారత్ ఘన విజయం,
శతక్కొట్టిన సచిన్,
శివాలెత్తిన సచిన్,
సచిన్ ఒంటరి పోరాటం వృధా,
సచిన్ సెంచరీ.. విజయం దిశగా భారత్,
సచిన్ విరోచిత పోరాటం,
సచిన్ శివతాండవం..ఇలాంటి పేపర్ కటింగ్స్ పుస్తకాల్లో దాచుకుని.. అపురూపంగా చూసుకున్న క్షణాలను ఎలా మరచిపోగలం? ఇలా సచిన్ అందించిన జ్ఞాపకాలు ఎన్నెన్నో. అయినా మాపిచ్చి గాని..100 సార్లు 100 కొట్టిన దేవుడిని.. ఎన్ని అక్షరాలతో అభిషేకిస్తే మాత్రం సరిపోతుంది? అందుకే మన క్రికెట్ దేవుడు నిండు నూరేళ్లు.. ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఆయనకి సుమన్ టీవీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతోంది. మరి.. సచిన్ గురించి మీ అభిప్రాయాలను తెలుపుతూ, కామెంట్స్ రూపంలో ఆయనకి విషెష్ అందించండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.