ప్రపంచ వ్యాప్తంగా టీ20 లీగ్ ల హవా నడుస్తున్న వేళ.. స్టార్ బ్యాటర్లు, బౌలర్లు దుమ్మురేపుతున్నారు. వేలంలో కోట్లకు కోట్లు కుమ్మరించి ఆటగాళ్లను కొనుగోలు చేశాయి ఫ్రాంఛైజీలు. అయితే ఈ వేలాల్లో కొంత మంది స్టార్, సీనియర్ ఆటగాళ్లకు చేదు అనుభవం ఎదురైంది. వారిని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. అలాంటి వారిలో సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఒకడు. సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 లీగ్ లో బవుమాను ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే ఇంగ్లాండ్ తో జరిగిన మూడు వన్డేల సిరీస్ ను 2-1తో సౌతాఫ్రికా కైవసం చేసుకోవడంలో బవుమా కీలక పాత్ర పోషించాడు. అనుకోని విధంగా సౌతాఫ్రికా టీ20 లీగ్ లోకి అడుగుపెట్టిన బవుమా కీలక ఇన్నింగ్స్ ఆడి సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును సెమీస్ చేర్చాడు.
టెంబా బవుమా.. సౌతాఫ్రికా కెప్టెన్ గా, నిలకడైన బ్యాటర్ గా అతడికి మంచి రికార్డే ఉంది. దాంతో తొలిసారి సౌతాఫ్రికాలో ప్రారంభించిన టీ20 లీగ్ లో ఎదో ఒక ప్రాంఛైజీ బవుమాను కొనుగోలు చేస్తుందని అందరు భావించారు. కానీ అనూహ్యంగా అతడిని ఏ ప్రాంఛైజీ కొనుగోలు చేయలేదు. దాంతో కసిపెంచుకున్న బవుమా.. తన పగని అంతా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీల్ లో చూపించాడు. ఓ శతకంతో సహా మూడు మ్యాచ్ ల్లో 180 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్ గెలిచిన తర్వాత.. అనుకోని ఆఫర్ బవుమా తలుపు తట్టింది. సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సన్ రైజర్స్ తరపున ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లాండ్ ఆటగాడు టామ్ ఏబెల్.. శ్రీలంక పర్యటనకు వెళ్లడంతో.. బవుమాను సంప్రదించింది సన్ రైజర్స్ యాజమాన్యం.
ఇక తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు బవుమా. ఆడిన తొలి మ్యాచ్ లో డకౌట్ గా వెనుదిరిగినప్పటికీ.. రెండో మ్యాచ్ లో చెలరేగాడు. జోబర్గ్ సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ఓపెనర్ గా బరిలోకి దిగిన బవుమా 34 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 50 పరుగులతో చెలరేగాడు. అయితే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 24 పరుగుల తేడాతో ఓడిపోయినప్పటికీ.. సెమీస్ చేరుకుంది సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్. దానికి ఒకే ఒక్క కారణం బవుమా బ్యాటింగ్. తనను లీగ్ లో కొనలేదనే కసిని తన బ్యాటింగ్ లో చూపించాడు ఈ సౌతాఫ్రికా సారథి. కేవలం టెస్టులకు, వన్డేలకే పనికొస్తాడన్న ముద్రను ఈ ఒక్క ఇన్నింగ్స్ తోనే చెరిపేశాడు. ఈ ఇన్నింగ్స్ కారణంగానే సన్ రైజర్స్ ఈస్టర్న్ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో సెమీస్ కు వెళ్లింది. బవుమా కీలక ఇన్నింగ్స్ కారణంగా సన్ రైజర్స్ నెట్ రన్ రేట్ పెరిగి సెమీస్ కు దూసుకెళ్లింది.
After an epic #Betway #SA20 clash at the Wanderers, here are the current standings.@Betway_India pic.twitter.com/sefUKveT2P
— Betway SA20 (@SA20_League) February 6, 2023
ఈ లీగ్ లో 10 మ్యాచ్ లు ఆడిన సన్ రైజర్స్ 4 మ్యాచ్ ల్లో గెలిచి 5 మ్యాచ్ ల్లో ఓడిపోయింది. దాంతో సన్ రైజర్స్ కు 19 పాయింట్లతో +0.316 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో నిలిచింది. బవుమా గనక ఈ మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే.. సన్ రైజర్స్ ఇంటి దారి పట్టేదే అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. జట్టులో కెప్టెన్ డు ప్లెసిస్ 61 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్ లతో 92 పరుగుల చేయగా.. హెండ్రిక్స్ 40 రన్స్ తో రాణించాడు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 136 పరుగులకే పరిమితం అయ్యింది. జట్టులో బవుమా ఒక్కడే 50 పరుగులతో రాణించాడు.
JUST IN: Temba Bavuma, who wasn’t picked at the auction, has been signed as a replacement for Tom Abell by Sunrisers Eastern Cape for the rest of the #SA20 pic.twitter.com/PIhUbIJUah
— ESPNcricinfo (@ESPNcricinfo) February 2, 2023