ఆదిభట్లలో కిడ్నాప్ అయిన డాక్టర్ వైశాలి కథ ఓ కొలిక్కి వచ్చింది. కిడ్నాపర్ ని పట్టుకున్నారు పోలీసులు.. యువతిని రక్షించారు. వైశాలిని నల్లగొండ జిల్లా మంచన్‌పల్లి దగ్గర వదిలేసి వెళ్ళిపోయినట్లుగా గుర్తించారు. కాగా, వైశాలి అంతకుముందు తల్లిదండ్రులకు ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. తండ్రి దామోదర్‌కు ఆమె ఫోన్ చేసినట్లుగా మీడియాలో కథనాలు వచ్చాయి. తాను క్షేమంగానే వున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తండ్రికి చెప్పినట్లుగా కథనాలు వచ్చాయి.
అయితే.. ఈ కిడ్నాప్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు నవీన్‌రెడ్డి మిస్టర్ టీ ఓనర్. అతడు వైశాలితో కలిసి చదువుకోవడం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని.. కాలక్రమేణా అది ప్రేమగా మారిందని పోలీసులు చెబుతున్నారు. నవీన్‌రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకురావడందో తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా తాను నిర్ణయం తీసుకోలేనని వైశాలి చెప్పిందని, దీంతో నవీన్‌రెడ్డి యువతి ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడగా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదని చెప్తున్నారు. దీంతో కోపం పెంచుకున్న నవీన్‌రెడ్డి గతంలో ఆ యువతితో చనువుగా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశాడు. దీంతో వైశాలి, నవీన్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇది మనుసులో పెట్టుకున్న నవీన్ రెడ్డి, శుక్రవారం యువతిని చూడడానికి పెళ్లి చూపులకు వస్తున్న సంగతి తెలుసుకొని వందమందితో ఆమె ఇంటికి దాడిచేశాడు. అడ్డు వచ్చిన వారిపై రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి మరీ ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లాడు. కాగా, తన కూతురు కిడ్నాప్‌లో స్థానికుల ప్రమేయం ఉందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ ఘటనపై స్థానిక పోలీసులపై కూడా ఆరోపణలున్నాయి. డయల్ 100కు కాల్ చేసిన 45 నిమిషాల తర్వాత ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఒకానొక సమయంలో సాగర్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు.