తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. మంగళవారం బాలిక కుటుంబసభ్యులను రేవంత్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఆయన తన ట్వీట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. బాలిక ఘటనపై నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకోవాలని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కొన్ని రోజులకు పోలీసులు నిందితుడిపై రివార్డు ప్రకటించారని, హుజూరాబాద్ ఎన్నికలను తీసుకున్నంత సీరియస్‌గా బాలిక హత్యాచార ఘటనను తీసుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా నిందితుడిపై రివార్డు ప్రకటించిన కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రియాంక హత్యాచార ఘటనలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీస్ అధికారి సజ్జనార్ కు ఈ కేసు బాధ్యత అప్పగించాలని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.