స్టేషన్ గన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య-సర్పంచ్ నవ్య ఎసిసోడ్ లో ట్విస్ట్ చోటు చేసుకుంది. గత రెండు మూడు రోజుల నుంచి ఎమ్మెల్యేపై మహిళా సర్పంచ్ నవ్య ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎమ్మెల్యే రాజయ్య జానీకపురం సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి వారిని కలుసుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్ పూర్ నియోజకవర్గంలోని జానకీపురం సర్పంచ్ నవ్య ఎమ్మెల్యే రాజయ్యపై కొన్ని ఆరోపణలు లేనెత్తిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే రాజయ్య నాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సర్పంచ్ నవ్య బహిరంగంగానే తన ఆవేదనను వెళ్లగక్కారు. అయితే ఇదే అంశం గత రెండు మూడు రోజుల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. రెండు రోజుల కిందట దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాజయ్య.. నాపై కొందరు కక్ష గట్టుకుని కావాలనే ఇలా లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఈ ఎపిసోడ్ లో భాగంగా ఆదివారం స్థానిక ఎమ్మెల్యే రాజయ్య ఏకంగా జానకీపురం సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి వారిని కలుసుకున్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ నవ్య మాట్లాడుతూ.. దేశంలో రోజుకొక దారుణం వెలుగు చూస్తుందని అన్నారు. మరీ ముఖ్యంగా మహిళలపై ఎక్కడైనా అన్యాయం జరిగితే.. నిందితులు ఎంతటి వారైనా సరే వెనకడుగు వేయకుండా ప్రశ్నించాలని ఆమె సూచించారు. తప్పు చేసిన వారిని నిలదీసి పెట్రోల్ పోసి తగలబెట్టాలని ఎమ్మెల్యే రాజయ్య ముందే సర్పంచ్ నవ్య హెచ్చరించారు. ఇక సమాజంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను మీ ముందుంటానని సర్పంచ్ నవ్య హామి ఇచ్చారు.
ఇక స్థానిక ఎమ్మెల్యే రాజయ్య మాకు టికెట్ ఇవ్వడంతోనే నేను సర్పంచ్ గా ఎన్నికయ్యానని, ముందు ముందు ఇలాంటి వేధింపులు వచ్చినా అస్సలు వెనక్కి తగ్గనని సర్పంచ్ నవ్య తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ.. నాకు జానకీపురం సర్పంచ్ నవ్య భర్త ప్రవీణ్ తెలుసని, నా రక్త సంబంధికులుగా భావిస్తానని అన్నారు. గతంలో సర్పంచ్ టికెట్ కోసం నా దగ్గరి ప్రవీణ్ మాత్రమే వచ్చాడని, నేను ఎప్పుడూ నవ్యను చూడలేదని ఆయన తెలిపారు. నేను ఏ ఊరిపట్ల వివక్ష చూపలేదని, నా ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని అన్నారు.
ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ.. జానకీపురం గ్రామంలో అనేక అభివృద్థి కార్యక్రమాలు చేపట్టామన్నారు. మరీ ముఖ్యంగా ఈ జానకీపురం గ్రామాన్ని నేను గతంలో దత్తత తీసుకున్నానని, ఈ సందర్భంగా గ్రామ అభివృద్దికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నానని రాజయ్య తెలిపారు. అయితే గత రెండు మూడు రోజుల నుంచి ఎమ్మెల్యే రాజయ్య ఎసిసోడ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సైతం స్పందించింది. అంతేకాకుండా అయనకు నోటీసులు కూడా జారీ చేసింది.