స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఎ తాటికొండ రాజయ్యకు సర్పంచ్ నవ్యకు మధ్య కొద్ది రోజులుగా వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఎంఎల్ఎ రాజయ్య తనను లైంగికంగా వేధించాడని సర్పంచ్ నవ్వ ఆరోపణలు చేసి కేసు కూడా పెట్టింది. కాగా ఆ కేసులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
ఎంఎల్ఎ రాజయ్య తాను పాల్గొన్న మీటింగ్ లలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్షలు ఎదుర్కొన్నారు. రాజయ్య కాంట్రవర్సీ వ్యాఖ్యలపై రాజకీయదూమారం చెలరేగింది. ప్రతిపక్ష పార్టీలే కాక సొంత పార్టీ వాళ్లు కూడా ఎంఎల్ఎ తీరుపై విమర్శలు గుప్పించారు. ఇదిలా ఉంటే కొన్ని నెలల క్రితం సర్పంచ్ నవ్యను ఎంఎల్ఎ రాజయ్య లైంగికంగా వేధించినట్లు వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. తనను లైంగికంగా ఎంఎల్ఎ వేధిస్తున్నాడంటూ సర్పంచ్ నవ్య మీడియా ముందు తన గోడు వెల్లబోసుకుంది. ఆ తర్వాత ఎంఎల్ఎ రాజయ్య సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి మీడియా సమక్షంలో మహిళాలోకానికి క్షమాపణలు తెలిపాడు. అంతేకాకుండా జానకీపురం గ్రామానికి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించాడు.కాగా ఎంఎల్ఎ రాజయ్యపై గతంలో ఆరోపణలు చేసిన సర్పంచ్ నవ్య మరో సారి ఆరోపణలు గుప్పించింది. ఎంఎల్ఎపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. ఎన్నో మలుపులు తిరుగుతూ ఈ కేసు బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.
గతంలో ఎంఎల్ఎ గ్రామాభివృద్దికి రూ. 25 లక్షలు ఇస్తానని చెప్పి ఇప్పుడు మాటమార్చి గతంలో రూ. 20 లక్షలు అప్పుతీసుకున్నట్టుగా సంతకం పెట్టాలని ఒత్తిడి చేస్తున్నట్లు నవ్య తెలిపింది. ఎంఎల్ఎ వేధింపులకు సంబంధించి తన దగ్గర ఆదారాలున్నాయని చెప్పింది. ఈ క్రమంలో ఎంఎల్ఎ రాజయ్య, అతడి అనుచరులపై సర్పంచ్ నవ్య పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. నవ్య చేసిన ఆరోపణలను కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు సుమోటోగా స్వీకరించి, దర్యాప్తు జరిపి నివేదిక అందించాలని పోలీసు అధికారులను మహిళా కమిషన్ ఆదేశించింది.
దీంతో పోలీసులు నవ్యకు నోటీసులు అందజేశారు. ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాధారాలుంటే సమర్పించాలని నోటీసుల్లో కోరారు. కాగా సర్పంచ్ నవ్య ఎటువంటి ఎవిడెన్స్ ను సమర్పించలేదు. దీని ఆధారంగా పోలీసులు నవ్య చేసిన ఆరోపణల్లో నిజం లేదని మహిళా కమిషన్ లకు నివేదిక సమర్పించారు. రెండు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికి ఏవిధమైన ఆదారాలు సమర్పించకపోవడంతో కేసును కొట్టి వేయవచ్చని మహిళా కమిషన్ కు తెలిపారు. దీంతో సర్పంచ్ నవ్యకు ఎంఎల్ఎ రాజయ్యకు మధ్య వివాదానికి తెరపడింది.