ప్రజా ప్రతినిధి హోదాలో ఉండి ప్రజల సమస్యలను తీర్చాల్సిన ఎమ్మెల్యే.. మహిళా సర్పంచ్ పట్ల అసభ్యంగా వ్యవహరిస్తూ వార్తల్లో నిలిచారు. స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ వైద్య శాఖ మంత్రి తాడి కొండ రాజయ్య.. తనను వేధిస్తున్నారంటూ ఓ మహిళా సర్పంచ్ ఆవేదన చెందుతున్నారు.
ప్రజా శ్రేయస్సు, సంక్షేమం కోసం పాటు పడాల్సిన ఎమ్మెల్యే కీచక పర్వానికి తెరలేపాడు. ప్రజాప్రతినిధి హోదాలో ఉంటూ పాడు పనులు చేస్తున్నాడు. మరో మహిళా ప్రజా ప్రతినిధిపై లైంగిక వేధింపులకు దిగాడు. ఈ ఘటన ఎక్కడో జరిగిందీ కాదూ.. తెలుగు రాష్ట్రాల్లో అందులోనూ తెలంగాణాలో. స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తనకు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ హన్మకొండ జిల్లా జానకీపురం మహిళా సర్పంచ్ నవ్య ఆరోపణలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. తనను లైంగికంగా వేధించడంతో పాటు అతని అనుచరులతో కూడా ఫోన్లు చేయించి వేధిస్తున్నారు అంటూ ఆవేదన చెందారు.
తాడి కొండ రాజయ్యను తనను తండ్రిగా భావించానని అన్నారు. రెండు మూడేళ్లుగా రాజయ్య తనకు ఫోన్ చేసి అనుచితంగా మాట్లాడారని, ఎక్కడి రమ్మంటే అక్కడి రావాలని వేధించేవారని చెప్పారు. మానసికంగా కూడా ఎమ్మెల్యే హింసించినట్లు చెప్పారు. ‘నువ్వు రా. నీ కోసం వెయిట్ చేస్తున్నా’అంటూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. తాను లొంగనందుకు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడం, పార్టీలో జరుగుతున్న కీలక సమావేశాల గురించి సమాచారం ఇవ్వకపోవడం చేస్తున్నారని అన్నారు. ఆయన అనుచరులు కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారని, అందులో మహిళలు కూడా ఉన్నారని ఆవేదన చెందారు.
‘నువ్వు నాతో కలిసి బయటకు వస్తే నీకు కావాల్సినవన్నీ కొనిపెడతా..బంగారం కావాలా? నగలు కావాలా? నీ పిల్లల చదువులకు అయ్యే ఖర్చు అంతా నేనే చూసుకుంటానంటూ వేధిస్తున్నారని’ చెప్పారు. మహిళలు కూడా ఆయన చెప్పినట్లు నడుచుకోవాలని వేధిస్తున్నారని తెలిపారు. వారు రాజకీయం కాదని, రౌడీయిజం చేస్తున్నారని అన్నారు. తనలాగే చాలా మంది మహిళా నేతలు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని, తనకు తన కుటుంబం అండగా నిలుస్తోందని అన్నారు. ఆడవాళ్లు కనిపిస్తే చాలు ఆయన వారి భుజాలపై చేతులు వేయడం, చేతులు పట్టుకోవడం, ఒత్తడం వంటి గలీజు పనులు చేస్తాడని చెప్పారు. దగ్గరకు రాకపోతే.. చిరాకుగా ప్రవర్తిస్తాడని అన్నారు.
తనకు ఫోన్ చేసి రావాలని ఆయనతో పాటు మధ్యవర్తులతో ఫోన్లు చేయించాడని అన్నారు. మహిళా దినోత్సవం రోజు జరిగిన కార్యక్రమాలకు కూడా తనను పిలువలేదని వాపోయారు. తన భార్య నవ్యపై రాజయ్య వేధింపుల గురించి సర్పంచ్ భర్త మాట్లాడుతూ..‘నువ్వు సర్పంచ్ అయ్యే అవకాశాన్ని నేనే ఇచ్చాను..నిన్ను చూసి అవకాశం ఇచ్చాను తప్ప వేస్ట్ గాడు నీ భర్తను చూసి ఇవ్వలేదు’ అని రాజయ్య అన్నారని చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఈ విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళతానని సర్పంచ్ నవ్య కన్నీటితో తెలిపారు. ఇటువంటి నేతలతో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డ పేరు వస్తోందని ఇటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్పంచ్ నవ్య డిమాండ్ చేశారు.
తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను స్టేషన్ ఘనపూర్ భారాస ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఖండించారు. ఎన్నికలు దగ్గర పడుతున్నందున.. గతంలో జరిగినట్లుగా రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొంత మంది అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్రలకు పాల్పడుతున్నారన్నారు. ఇంటి దొంగలే శిఖండి పాత్ర పోషిస్తూ అబండాలు వేస్తున్నారని ఆక్షేపించారు. సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని కలిసి అన్ని విషయాలు వివరిస్తానని చెప్పారు. ఎమ్మెల్యేపై సర్పంచ్ చేస్తున్న ఆరోపణలు సరి అయినవేనని మీరు భావిస్తే కామెంట్ల రూపంలో తెలియజేయండి.