మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ హుజురాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గెలుపు గుర్రాల వేటలో తలమనకలవుతున్నాయి. ఒక పక్కఈటెల బీజేపీలో చేరి పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టాడు. వరుస సమావేశాలతో ప్రజలతో మమేకమవుతూ రాజకీయంగా దూకుడు పెంచుతున్నారు. ఇక ప్రధానంగా హుజురాబాద్ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు సీఎం కెసిఆర్. ఎలాగైనా ఈటెలకు చెక్ పెట్టి, ఓడించాలని కంకణం కట్టుకున్నారు సీఎం.
ఈ క్రమంలోనే ఏకంగా దళిత బంధు అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఇక కెసిఆర్ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్టు స్పష్టమవుతోంది. మొదట దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేయనున్నామని, ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామని ప్రభుత్వ వర్గం నేతలు చెబుతున్నారు. ఇక ఈ నియోజకవర్గంలోని దళిత, సామాజిక వర్గం ఓట్లన్నిదండుకోవడానికి దళిత బంధు పథకం పేరుతో కొత్త నాటకానికి సీఎం తెర తీశారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు నేతలు హుజురాబాద్ ఉప ఎన్నిక విజయంపై సర్వేలు చేయిస్తూ రిపోర్ట్‌లు సైతం బయటపెడుతున్నారు.
తాజాగా తెలంగాణ భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించి తాను సర్వే చేయించానని అందులో ఈటలకు 67శాతం ఓట్లు పడతాయని ఆయన జోస్యం చెప్పారు. ఇక అధికార పార్టీ అయిన టీఆర్ఎస్‌కు మాత్రం 30 శాతం మంది ప్రజలే మొగ్గుచూపుతున్నారని ఆయన వెల్లడించారు. ఇక కాంగ్రెస్ పార్టీకి మాత్రం 5 శాతం లోపు ఓట్లు పోలయ్యే విధంగా రిపోర్ట్ లో ఉన్నాయని కోమటి రెడ్డి తెలిపారు. ఇక ఎన్నికల కమిషన్ నోటీఫికేష్ కుడా విడుదల చేయకముందే హుజురాబాద్‌లో ఎన్నికల వేడి రాజుకుందనే చెప్పాలి.