ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట రాజకీయాలలో అతడో యువ సంచలనం.. అతడు అడుగు పెడితే జన సంద్రం.. మాట్లాడితే జనహోరు. ఓ స్టార్ హీరోకు ఉన్నంత మాస్ ఫాలోయింగ్ అతడికుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక సోషల్ మీడియాలో ఈ యువ నాయకుడి ఫాలోయింగ్ చూస్తే.. పిచ్చెక్కిపోవడం ఖాయమే. ఇంతకీ ఆ యువ నాయకుడు ఎవరో తెలుసా? బైరెడ్డి సిద్దార్థ రెడ్డి. ఏపీ రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకుంటూ దూసుకెళ్తున్నాడు ఈ యువ నాయకుడు. సీఎం జగన్ కు వీరాభిమానిగా ఉంటూ.. పార్టీకి వెన్నంటే ఉంటూ వస్తున్నాడు సిద్దార్థ్ రెడ్డి. అయితే సొంత పార్టీ నేతలే తనకు కళ్లెం వేస్తున్నారన్న వార్తలపై తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు సిద్దార్థ్ రెడ్డి. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తన దైన ముద్ర వేసుకుంటు వెళ్తున్నాడు ఏపీ శాఫ్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. సీఎం జగన్ కు ముఖ్య అనుచరుడిగా ఉంటూ.. పార్టీకి అండగా ఉంటానని చాలా సందర్భాల్లో సిద్దార్థ్ రెడ్డి చెప్పారు. ఇక సిద్దార్థ్ రెడ్డి ఫాలోయింగ్ చూసి.. సొంత పార్టీ నేతలే అతడికి ముకుతాడు వేస్తున్నారన్న ఆరోపణలు కూడా రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి. చిరుత పులిలా ఉండే మిమ్మల్ని మీ పార్టీ నేతలే బోనులో బంధించారా? అని యాంకర్ ప్రశ్నించగా.. బైరెడ్డి సమాధానమిస్తూ..”నా పై ఎలాంటి ఆంక్షలు లేవు. సొంత పార్టీ వాళ్లే నన్ను అడ్డుకుంటే.. ఈ రోజు నేను నియోజకవర్గంలో ఎన్నో సభలు, ర్యాలీలు, కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటాను. అందరితో కలిసి, అందరిని కలుపుకొని పొవడమే నాకు తెలిసింది” అని అన్నారు.
ఇక సీఎం జగన్ మిమ్మల్ని మీడియాకు దూరంగా ఉండమన్నారట? అని ప్రశ్నిస్తే..”నన్ను మీడియాకు దూరంగా ఉండమని ఏనాడు జగన్ మోహన్ రెడ్డిగారు చెప్పలేదు. సీఎం కు నాపై ప్రేమా, నమ్మకం లేకపోతే నాకు శాఫ్ ఛైర్మన్, యువజన విభాగాం అధ్యక్ష పదవి ఎందుకు ఇస్తారు. సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్లు పెట్టనంత మాత్రాన నాపై ఆంక్షలు పెట్టినట్లు కాదు” అని సిద్దార్థ్ రెడ్డి తెలిపాడు. నాకు ఇచ్చిన పదవులు, బాధ్యతలను నిర్వర్తిస్తూ.. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నానని, వైసీపీలో నన్ను అడ్డుకునే వారు లేరని సిద్దార్థ్ రెడ్డి చెప్పుకొచ్చాడు. నన్ను పార్టీ ఏవిధంగాను అణదొక్కడానికి ప్రత్నించడం లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశాడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి.