రక్తదానం చేయడం అంటే.. ప్రాణదానం చేయడమే. రక్తదానంలోనే దానం అనే మాట ఉంది. సో.., ఎక్కడ బ్లడ్ బ్యాంక్ కేంద్రాలు ఉన్నా.., దీనిని వ్యాపారంగా చూడకూడదు. నిజానికి ఇలాంటి రక్తదాన కేంద్రాలు నడవాలంటే మానత్వాన్ని చాటుకునే రక్తదాతలు ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇందుకే రక్తదానం చేసే ప్రాణదాతలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తారు. బ్లడ్ డొనేషన్ విషయంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, వారిలో అవగాహన పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందుకే.. రక్తదాతల సంస్థ అంతర్జాతీయ సమాఖ్య 1995 నుండి ప్రతి ఏటా.. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది.
రక్తంలో ఏ, బి, ఒ అనే గ్రూపులు ఉన్నాయని.., వీటిని బట్టి ప్రమాదంలో ఉన్న ఒక మనిషికి మరో వ్యక్తి రక్తదానం చేసి బతికించవచ్చని కనుగొన్న నోబెల్ గ్రహీత కార్ల్‌ల్యాండ్ స్టెయినర్ జన్మదినం కూడా జూన్ 14. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని జూన్ 14నే జరుపుకోవడానికి ఇది ప్రధాన కారణం. ప్రపంచం మొత్తం మీద ప్రతి 2 క్షణాలలో.. ఎవరికో ఒకరికి రక్తం అవసరం ఏర్పడుతునే ఉంది.
ప్రమాదానికి గురైనవారికి, అకాల పక్వమైన పిల్లలకి, పెద్ద శస్తచ్రికిత్స అవసరమైన రోగులకు, డెలివరీ సమయంలో గర్భిణీలకు, రక్త సంబంధిత వ్యాధులు ఉన్న వారికి రక్తం అవసరం ఏర్పడుతుంది. రక్తదానం చేయడం మన విధిగా భావిస్తే ఇలాంటి వారందరి ప్రాణాలను కాపాడుకోవచ్చు. నిజానికి రక్తదానం చేయటం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సాధారణ ఆరోగ్యవంతమైన పురుషుడు ప్రతి మూడు నెలలకి ఒక్కసారి, స్త్రీ ప్రతి 6 నెలలకి ఒక్కసారి రక్తదానం చేయవచ్చు. ఇది.. ప్రపంచ రక్తదాన దినోత్సవం చరిత్ర. రక్తదానంకి ముందుకి వద్దాం. ప్రాణాలను నిలబెడదాం.