వెస్టిండీస్ పర్యటనలో దుమ్మురేపుతున్న తెలంగాణ కుర్రాడిని.. వన్డే ప్రపంచకప్ కు ఎంపిక చేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది.
నెల రోజుల ముందు వరకు కనీసం అతడి పేరు కూడా ఎక్కువ మందికి తెలియదు. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నా.. అంతర్జాతీయ స్థాయిలో అదే జోరు కొనసాగిస్తాడని ఎవరూ ఊహించలేదు. గతంలో ఎందరో ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మెరుపులు మెరిపించి జాతీయ జట్టు కు ఎంపికైనా.. తీవ్ర ఒత్తిడి మధ్య స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక కనుమరుగయ్యారు. అయితే తాను మాత్రం అందుకు భిన్నమని తెలంగాణ కుర్రాడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ నిరూపించుకున్నాడు.
వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కోసం తొలిసారి భారత జట్టుకు ఎంపికైన ఈ హైదారబాదీ.. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ దంచికొట్టాడు. ఇప్పటికే స్టార్ లుగా గుర్తింపు తెచ్చుకున్న ప్లేయర్లు సైతం పరుగుతు రాబట్టేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పిచ్ లపై తిలక్ తన తడాఖా చూపించాడు.మూడు మ్యాచ్ ల్లోనూ తుది జట్టులో చోటు దక్కించుకున్న తిలక్ వరుసగా 39, 51, 49 నాటౌట్ పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్ వచ్చి అవసరమైతే వేగంగా ఆడటంతో పాటు.. వికెట్ల పడ్డ స్థితిలో ఇన్నింగ్స్ ను నడిపించే బాధ్యత భూజానెత్తుకున్న తీరు ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది.
మూడు మ్యాచ్ ల అనుభవంతోనే.. ఎంతో పరిణతి కనిబర్చిన తిలక్ వర్మను వన్డే జట్టులోకి కూడా తీసుకోవాలనే డిమాండ్ పెరుగుతోంది. ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ వంటి వాళ్లు నిలకడగా ఆడలేకపోతున్న చోట తిలక్ తన క్లాసిక్ ఆటతో అదరహో అనిపించుకున్నాడు. విండీస్ తో మూడో టీ20లో భారీ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ జట్టును గెలిపించినా.. నిలకడ లేమి అతడికి ప్రధాన సమస్యగా మారింది. ఇక సంజూ శాంసన్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది.
అవకాశాల కోసం సుదీర్ఘంగా ఎదురుచూడటం వచ్చిన వాటిని వినియోగించుకోలేకపోవడం అతడికి పరిపాటిగా మారింది.అక్టోబర్ 5 నుంచి స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగనుండగా.. మెగాటోర్నీ కోసం బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. మిడిలార్డర్ లో కీలకమవుతారనుకున్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో.. తిలక్ ను ఎంపిక చేయడమే మంచిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తిలక్ ప్రదర్శన తనను ఎంతగానో ఆకట్టుకుందని భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ అన్నాడు. తిలక్ ను వన్డేల్లోనూ ఆడించవచ్చని పేర్కొన్నాడు.
వన్డే ప్రపంచకప్, ఆసియా కప్ వంటి మెగాటోర్నీల్లో ఆడేంత పరిపక్వత అతడిలో ఉందని అన్నాడు. ఆడిన మూడు మ్యాచ్ ల్లో 69.50 సగటు, 139 స్ట్రయిక్ రేట్ తో 139 పరుగులు చేసిన తిలక్ ను వన్డేల్లోకి ఎంపిక చేయాలని సూచించాడు.‘తిలక్ చాలా పరిపక్వత చూపిస్తున్నాడు. అతడి షాట్ల ఎంపిక కొత్త ఆటగాళ్లలా లేదుు. ఎంతో అనుభవం ఉన్నవాడిలా ఆచితూచి ఆడుతున్నాడు. తిలక్ వన్డేల్లో జట్టులోకి వస్తే సంతోషించే వారిలో నేను ముందుంటా. రాహుల్, శ్రేయస్ ఇంకా ఫిట్ నెస్ సాధించలేదు. ఆ ఇద్దరు అందుబాటులో లేనప్పుడు తిలక్ ను ఎందుకు తీసుకోకూడదు? టాప్ ఆర్డర్ లో లెఫ్ట్ హ్యాండర్ లోటును కూడా అతడు తీర్చగలడు. విండీస్ పర్యటనలో మరే ప్లేయర్ తిలక్ లా నిలకడ కనబర్చలేదు. క్రీజులోకి వచ్చీ రావడంతోనే అటాకింగ్ గేమ్ ఆడగలనని నిరూపించాడు’ అని జాఫర్ పేర్కొన్నాడు.