భారత జట్టుకు మరో ఆణిముత్యం లభించాడుు. హైదరాబాద్ నుంచి టీమిండియాలో అడుగుపెట్టిన ఠాకూర్ తిలక్ వర్మ రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా ముందుకు సాగుతున్నాడు.
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి టీ20లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఠాకూర్ తిలక్ వర్మ.. సహచరులంతా విఫలమైన చోట అద్వితీయ ప్రదర్శన కనబర్చి టాప్ స్కోరర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఆదివారం జరిగిన రెండో టీ20లోనూ సేమ్ సీన్ రిపీట్ కాగా.. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తిలక్ మరో కీలక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. శుభ్ మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ త్వరగానే పెవిలియన్ చేరిపోయిన సమయంలో ఇషాన్ కిషన్ తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఏమాత్రం ఒత్తిడికి లోనవని తిలక్.. ఎంతో అనుభవం ఉన్న వాడిలో బంతిని ఆచితూచి కొడుతూ విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. 41 బంతుల్లో 51 పరుగులు చేసిన అనంతరం మరో భారీ షాట్ కు యత్నించి క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్ ద్వారా తిలక్ పలు రికార్డులు తన పేరిట లిఖించుకున్నాడు.
టీమిండియా తరఫున అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా తిలక్ నిలిచాడు. 20 ఏళ్లా 271 రోజుల్లో ఈ హైదరాబాదీ అర్ధశతకం తన పేరిట రాసుకోగా.. భారత రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. హిట్ మ్యాన్ 20 ఏళ్లా 143 రోజుల వయసులోనే పొట్టి ఫార్మాట్ లో తొలి అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. 2007 టీ20 ప్రపంచకప్ లో భాగంగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో రోహిత్ ఈ ఫీట్ నమోదు చేశాడు. అయితే అప్పుడు హిట్ మ్యాన్ హాఫ్ సెంచరీ చేసేందుకు 40 బంతులు తీసుకోగా.. తాజాగా తిలక్ 39 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ చేరాడు. దీంతో పిన్న వయసులో వేగవంతమైన అర్ధశతకం చేసిన ప్లేయర్ గా తిలక్ రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో రిషబ్ పంత్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు 21 ఏళ్లా 38 రోజుల వయసులో టీ20 హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. దీంతో పాటు మరో రికార్డు సైతం తిలక్ తన పేరిట లిఖించుకున్నాడు.
తొలి టీ20లో 39 పరుగులు చేసిన తిలక్ గయానా వేదికగా జరిగిన రెండో పోరులో 51 పరుగులకు ఔటయ్యాడు. దీంతో తొలి రెండు మ్యాచ్ ల్లో 90 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫార్మాట్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో కలిపి అధిక రన్స్ చేసిన ప్లేయర్ గా తిలక్ రికార్డుల్లో కెక్కాడు. సూర్యకుమార్ యాదవ్ తొలి రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి 89 పరుగులతో భారత్ తరఫున అగ్రస్థానంలో ఉండగా.. ఇప్పుడా రికార్డును తిలక్ వర్మ 90 రన్స్ తో బద్దలు కొట్టాడు. మన్ దీప్ సింగ్ 83 పరుగులతో మూడో ప్లేస్ లో కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కాలం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడని సీనియర్ల చేత ప్రశంసలు అందుకున్న తిలక్ అందుకు తగ్గట్లే తొలి అడుగుల్లోనే అందర్నీ ఆకట్టుకుంటున్నాడు. అయితే రెండు మ్యాచ్ ల్లోనూ తిలక్ వీరోచితంగా పోరాడినా.. టీమిండియాకు పరజయం తప్పలేదు.